ఇపుడీ విషయమే చాలామందికి అర్ధం కావటంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు ఏ పిలుపిచ్చినా స్పందిస్తున్న తమ్ముళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటోంది. మరీ విషయాన్ని చంద్రబాబు కూడా పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. విషయం ఏదైనా రెగ్యులర్ గా క్షేత్రస్ధాయిలో కానీ  మీడియాలో గానీ కనబడుతున్న నేతల సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టచ్చంతే. వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, ఇప్పుడిప్పుడే దూళిపాళ నరేంద్ర యాక్టివ్ అవుతున్నారు.




మొదటినుండి బుద్ధా వెంకన్న, బోండా ఉమ లాంటి విజయవాడ నేతలు చాలామందితో పోల్చుకుంటే యాక్టివ్ గా ఉన్నారనే చెప్పాలి. కాకపోతే వీళ్ళు ఎక్కువగా మంత్రి కొడాలి నాని లేకపోతే డీజీపీ గౌతమ్ సవాంగ్ ను టార్గెట్ చేయటం మీద దృష్టిపెట్టారంతే. పై నేతల సంగతి వదిలేస్తే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోని నేతల మాటేమిటి ? పార్టీ అధికారంలో ఉన్నపుడు మంత్రులుగా, ఎంపీలు, ఎంఎల్ఏలుగా ఆకాశమే హద్దుగా అధికారాన్ని చెలాయించిన నేతలు వందల సంఖ్యలో ఉన్నారు.




అలాంటి నేతల్లో ఇపుడు కనీసం పదోశాతం మంది కూడా క్షేత్రస్ధాయిలో కనబడటంలేదు. ఒకపుడు నెల్లూరు నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాలో కనబడేవారు. చాలాకాలంగా ఆయన కూడా కనబడటం మానేశారు. మొత్తంమీద గ్రహించాల్సిందేమంటే ఉన్న కొద్దిమంది నేతలు కూడా రెగ్యులర్ గా మీడియా ముందు హడావుడి చేస్తున్నారే కానీ ఆందోళన కార్యక్రమాల్లో కనబడటంలేదు. ఉత్తరాంధ్రలో సీనియర్ నేత అశోక్ జగపతి రాజు ఎక్కువగా రామతీర్ధమనో లేకపోతే మాన్సాస్ ట్రస్ట సమస్యలున్నపుడు మాత్రమే మీడియా ముందుకొస్తున్నారు. ఎంత పోరాటం చేసినా ఉపయోగం ఉండదని మెజారిటి తమ్ముళ్ళు ఫిక్సయ్యారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.




శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని చాలామంది నేతలు అసలు అడ్రస్సే కనడటంలేదు. చంద్రబాబు ఏదన్నా జిల్లాకు వెళ్ళినపుడు మాత్రమే మొక్కుబడిగా హాజరవుతున్నారు. చంద్రబాబు జిల్లానుండి వచ్చేసిన తర్వాత మళ్ళీ మామూలే. షెడ్యూల్ ఎన్నికలకు ఇంక ఉన్నది రెండున్నర సంవత్సరాలే. ఈలోగానే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందనే ప్రచారం అందరు చూస్తున్నదే. ఇలాంటి సమయంలో కూడా తమ్ముళ్ళు జనాల్లో తిరగకపోతే రేపు ఎన్నికల్లో ఇంకేమి పోరాటాలు చేస్తారో అర్ధం కావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: