అధికార వైసీపీ గుడ్డిదర్బార్ లాగ నడుస్తున్నట్లుంది. ఒకవైపు పదవులు అందక కొందరు సీనియర్ నేతలు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తిగా ఉంటే మరోవైపు పదవులున్న వాళ్ళకే రెండుమూడు పదవులను కట్టబెడుతున్నారు. పదవుల పంపిణీలో పార్టీలో ఒక పద్దతి, పాడు లేకుండా సాగిపోతోంది. ఒకళ్ళకే రెండుమూడు పదవులు కట్టబెట్టే బదులు మరో ఇద్దరు సీనియర్ నేతలకు కూడా పదవులిచ్చి శాటిస్ ఫై చేయచ్చన్న ఆలోచన రాకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.





తాజాగా పార్టీ తరపున వివిధ అనుబంధ విభాగాల్లో 24 మందిని పదవుల్లో నియమించింది పార్టీ. జగన్ ఆదేశాల ప్రకారమే నేతలను పదవుల్లో నియమించినట్లు ప్రకటనలో ఉంది. అయితే ఇందులో విచిత్రం ఏమిటంటే ఇప్పటికే పదవుల్లో ఉన్నవారికే మరిన్ని పదవులను కట్టబెట్టారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా నందికొట్కూరుకు చెందిన బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిని నియమించారు. బైరెడ్డి ఇప్పటికే శాప్ ఛైర్మన్ గా ఉన్నారు. శాప్ ఛైర్మన్ గా ఉన్న బైరెడ్డినే యువజన విభాగం అధ్యక్షునిగా నియమించేబదులు ఇంకొకరిని నియమించుండచ్చు.





మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా పోతుల సునీతను నియమించారు. ఈమె ఇఫ్పటికే ఎంఎల్సీగా ఉన్నారు. ఈమె స్ధానంలో మరొక నేతను నియమించుంటే బాగుండేది. బీసీ సెల్ అధ్యక్షుడిగా జంగా కృష్ణమూర్తిని నియమించారు. జంగా ఇప్పటికే ఎంఎల్సీగా ఉన్నారు. వాణిజ్య విభాగానికి ఎంఎల్ఏ వెల్లంపల్లి శ్రీనివాస్ ను నియమించేబదులు ఇంకొకరిని నియమించవచ్చు. మైనారిటి సెల్  అధ్యక్షుడిగా ఎంఎల్ఏ హఫీజ్ ఖాన్ కాకుండా మరొక నేతే దొరకలేదా ?





టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలిగా ఎంఎల్సీ కల్పతారెడ్డిని నియమించారు. ఈమె అసలు వైసీపీ ఎంఎల్సీయే కాదు. తుడా ఛైర్మన్ గా చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియామకం కూడా ఇలాంటిదే. చెవిరెడ్డికి ఎంఎల్ఏ+తుడా ఛైర్మన్+టీడీపీ మెంబర్ గా నియమితులయ్యారు. ఇలాంటి నియామకాలు చేసేటపుడు జగన్ వాస్తవాలను పట్టించుకుంటున్నట్లు లేదు. ఒకేవ్యక్తికి ఇన్ని పదవులు ఇస్తే సదరు నేత దేనికీ న్యాయం చేయలేరని అందరికీ తెలిసిందే. జగన్ నాయకత్వం కూడా మరీ ఇంత గుడ్డి దర్బార్ లాగ అయిపోతే ఎలాగబ్బా ?


మరింత సమాచారం తెలుసుకోండి: