ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షాల వైఖరి భలే విచిత్రంగా ఉంటోంది. మిత్రపక్షాలన్నాక లక్ష్యాలు ఒకటిగానే ఉండాలి. కానీ ఈ మిత్రపక్షాల టార్గెట్లు మాత్రం వేర్వేరు కావటంతోనే దారులు కూడా వేర్వేరుగా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే బీజేపీ-జనసేన పేరుకుమాత్రమే మిత్రపక్షాలు. మిగితా అన్నీ వ్యవహారాలు, టార్గెట్లు మాత్రం వేర్వేరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ ఏమో జగన్మోహన్ రెడ్డి.
ఇదే సమయంలో బీజేపీ టార్గెట్ ప్రధానంగా  చంద్రబాబునాయుడు. వచ్చేఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని అప్పుడు వేరేదారిలేక తమ్ముళ్ళంతా బీజేపీలో చేరిపోతారని కమలనాదులు అంచనాలు వేసుకుంటున్నారు. గత్యంతరం లేక టీడీపీ కూడా చివరకు బీజేపీలో విలీనం అయిపోతుందని బీజేపీ నేతలు ఆశపడుతున్నారు. అప్పుడు అధికారపార్టీకి బీజేపీ మాత్రమే ప్రధాన ప్రతిపక్షం అవుతుందన్నది కమలనాదుల అంచనా. ఈ విషయాన్ని బీజేపీ నేతలు రహస్యంగా ఏమీ దాచుకోవటంలేదు.
వచ్చేఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగైపోతుందని అప్పుడు బీజేపీనే ప్రధాన ప్రతిపక్షమని చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు. అందుకనే టీడీపీ ఓడిపోవాలని బీజేపీ నేతలు గట్టిగా కోరుకుంటున్నారు. కాబట్టి సహజంగానే చంద్రబాబును కమలనాదులు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇదేసమయంలో పవన్ ఆలోచనలు మరోరకంగా ఉన్నాయి. వచ్చేఎన్నికల్లో వైసీపీని ఓడించి జగన్ను లేవకుండా గట్టిదెబ్బ కొట్టాలని కసితో రగిలిపోతున్నారు. అందుకనే సమయం, సందర్భం కాకపోయినా పర్వాలేదు రెగ్యులర్ గా జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు.
మిత్రపక్షాల టార్గెట్లు, ప్రాధాన్యతలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టే రెండుపార్టీలు కలవలేకపోతున్నాయి. ఇంతోటిదానికి మళ్ళీ మిత్రపక్షాలుగా ఉండటం ఎందుకో వాళ్ళే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో జగన్ను దెబ్బకొడితే ఇక వైసీపీ కనుమరుగైపోతుందని పవన్ బలంగా నమ్ముతున్నారు. తనను భీమవరం, గాజువాకల్లో ఓడించటమే కాకుండా ప్రతిరోజు విపరీతంగా ర్యాగింగ్ చేస్తున్న వైసీపీ అంటే పవన్లో విపరీతమైన ధ్వేషభావం పెరిగిపోతోంది. ఒంటరిగా ఏమీ చేయలేరని తెలుసుకాబట్టే టీడీపీతో పొత్తుకు రెడీ అయిపోయారు. మరి జనసేన, బీజేపీ ఏ మేరకు తమ టార్గెట్లను రీచవుతాయో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: