
పదేళ్ళుగా నందమూరి బాలకృష్ణ ఎంఎల్ఏగా ఉన్నా ఇంకా విషయం అర్ధమైనట్లులేదు. సినిమా షూటింగుల్లో లాగే నిజమైన అసెంబ్లీలో కూడా నోటికొచ్చిన డైలాగులు చెప్పవచ్చని, తొడకొట్టవచ్చని, మీసాలు మెలేయవచ్చనే భ్రమల్లోనే ఉన్నట్లున్నారు. అందుకనే అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ను చూస్తు తొడకొట్టి మీసం మేలేశారు. దాంతో మండిపోయిన స్పీకర్ బాలయ్యకు ఫుల్లుగా క్లాసు పీకారు. క్లాసు పీకటమే కాదు తీవ్రస్ధాయంలో వార్నింగ్ ఇచ్చారు. మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నట్లు హెచ్చరించారు.
సినిమాల్లో అయితే బాలయ్య తొడకొట్టగానే, మీసం మెలేయగానే స్పీకర్ కుర్చీలో కూర్చున్న పాత్రదారి భయంతో వణికిపోతాడు. కానీ అదే నిజజీవితంలో కూడా అసెంబ్లీలో మీసం మెలేసి తొడకొడితే ఏమవుతుంది ? తీవ్ర స్ధాయిలో వార్నింగ్ ఎదురైంది. మొదటితప్పుగా క్షమించి వదిలిపెట్టేసినట్లు స్పీకర్ హెచ్చరించారు.
అసలు విషయం ఏమిటంటే అసెంబ్లీ మొదలవ్వగానే టీడీపీ ఎంఎల్ఏలంతా చంద్రబాబునాయుడు అరెస్టు, రిమాండు అక్రమం, అన్యాయమంటు గోల మొదలుపెట్టారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై చర్చిద్దామని మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ఎంతచెప్పినా వినలేదు. వినకపోగా స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి గోల మొదలుపెట్టారు. ఎంఎల్ఏలతో మాట్లాడేందుకు స్పీకర్ ప్రయత్నించినా ఎంఎల్ఏలు వినలేదు. ఇష్టం వచ్చినట్లు అరుస్తు గోలచేశారు. ఇదే సమయంలో స్పీకర్ ను ఉద్దేశించి బాలకృష్ణ ఏదో మాట్లాడుతు తొడకొట్టి, మీసం మెలేశారు.
దాంతో అల్లరిచేసిన ఎంఎల్ఏలను స్పీకర్ సభనుండి సస్పెండ్ చేశారు. ఇదే సమయంలో బాలయ్య చర్యను నిరసిస్తు మంత్రి అంబటి రాంబాబు, కొందరు ఎంఎల్ఏలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. మీసాలు మెలేయటాలు, తొడలు కొట్టుకోవటాలు ఇంటికి వెళ్ళి చేసుకోమని ఎద్దేవాచేశారు. ఇదే విషయమై స్పీకర్ జోక్యం చేసుకుని తొడకొట్టి, మీసం మలేసిన బాలయ్యకు ఫుల్లుగా క్లాసు పీకారు. ఇలాంటి చేష్టలు సభ బయటే కానీ సభలోపల పనికిరావని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దాంతో బాలయ్య మారుమాట్లాడకుండా సీట్లోనే కూర్చుండిపోయారు. మరిప్పటికైనా సినిమా షూటింగులో అసెంబ్లీ సెట్టింగుకు నిజమైన అసెంబ్లీకి తేడా తెలిసిందో లేదో.