ఏలూరు జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గాలలో ఏలూరు పార్లమెంటు పరిధిలోని దెందులూరు నియోజకవర్గం ఒకటి. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే, మాజీ విఫ్‌ చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నరాలు తెగే ఉత్కంఠ మధ్య అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం దెందులూరు. పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం మెట్ట ప్రాంత రాజకీయాలలో దివంగత మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు టైగర్ గా ఒక వెలుగు వెలిగారు.

ఆ తర్వాత ఆ స్థాయిలో చింతమనేని ప్రభాకర్‌కు కూడా అభిమానులు ముద్దుగా టైగర్ బిరుదు ఇచ్చారు. చింతమనేని కాస్తా టైగర్ చింతమనేని అయ్యారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనాన్ని తట్టుకుని 2009 ఎన్నికల్లోను.. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచిన చింత‌మ‌నేని రాష్ట్రవ్యాప్తంగానే కాదు.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. 2019 ఎన్నికలలో చింతమనేనిపై ఎవరిని పోటీకి పెట్టాలా ? అని ఎన్నో ఎత్తులు వేసిన జగన్ అదే సామాజిక వర్గానికి చెందిన కొఠారు అబ్బయ్య చౌదరిని రంగంలోకి దించారు. అబ్బయ్య చౌదరి తండ్రి కొఠారు రామచంద్రరావు 2009లో చింతమనేని పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2024 ఎన్నికలలో దెందులూరు నియోజకవర్గ ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అన్నదే ఆసక్తిగా మారింది. గత ఎన్నికలలో చింతమనేని వరుసగా మూడోసారి విజయం సాధించి దెందులూరు లో హ్యాట్రిక్ కొడతారని అందరూ అనుకున్నారు.. కానీ జగన్ ప్రభంజనంతో పాటు స్థానికంగా చింతమనేని చేసిన కొన్ని తప్పులతో ఆయన ఓటమి పాలయ్యారు. ఓడిపోయినప్పటి నుంచి కూడా చింతమనేని నియోజకవర్గం పార్టీ కార్యకర్తలను వదలకుండా కాపాడుకుంటూ వచ్చారు. మరి ముఖ్యంగా ఆయనపై అనేకనేక అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టి నానా ఇబ్బందులకు గురిచేసిన జగన్ ప్రభుత్వం పట్ల నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది.

దీనికి తోడు ఐదేళ్లలో నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి త‌న బ్రాండ్ మార్క్ అంటూ చెప్పుకునేలా చేసిన అభివృద్ధి పని ఒక్కటే లేదు. ఏమాట‌కు ఆ మాట ప్రభాకర్ దూకుడుగా ఉన్నా పదేళ్లపాటు నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తిగతంగా సేవలు చేయటాన్ని ప్రభాకర్ ఎప్పుడు ఆపలేదు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి.

పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. తాను ఎమ్మెల్యేగా లేక‌పోయినా త‌న త‌లుపు త‌ట్టిన వారంద‌రికి ప్ర‌భాక‌ర్ అండ‌గా నిలుస్తూ వ‌స్తున్నారు. ప్ర‌భాక‌ర్‌ను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌తో పాటు అన్నీ సామాజిక వ‌ర్గాలు ఓన్ చేసుకుంటున్నా.. ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గంలోనే కొంద‌రు నేత‌లు వ్య‌తిరేకిస్తోన్న ప‌రిస్థితి.
ఇటు అబ్బ‌య్య చౌద‌రి సౌమ్యంగా ఉన్నా ఆయ‌న చుట్టూ ఉన్న కొంద‌రు నేత‌ల తీరు వ‌ల్ల ఆయ‌న‌కు బాగా డ్యామేజ్ జ‌రిగింది. ఓవ‌రాల్‌గా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న సంక్షేమ ప‌థ‌కాలే త‌ప్పా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో కొత్తగా వ‌చ్చిన ప్రాజెక్టులు లేవు... ప‌లు ప్రాంతాల్లో తాగు నీటి స‌మ‌స్య తీవ్రంగా ఉంది. డ్రైనేజ్‌లు, ర‌హ‌దారులు కూడా పోయ‌లేని ప‌రిస్థితి. ఇవ‌న్నీ ఈ సారి ఎన్నిక‌ల్లో త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌భావం చూప‌బోతున్నాయి. ఏదేమైనా దెందులూరు పోరు ఈ సారి తీవ్రమైన ఉత్కంఠ‌గా ఉన్నా ప్ర‌స్తుతానికి టీడీపీ కే కాస్త ఎడ్జ్ ఉంద‌న్న‌ది గ్రౌండ్‌లో క్లీయ‌ర్ క‌ట్‌గా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: