దేశంలో మళ్లీ మోడీ గెలుస్తారా అంటే కచ్చితంగా అనే సమాధానమే వస్తోంది. విపక్ష కాంగ్రెస్‌ సహా ఏ పార్టీ కూడా బలంగా లేకపోవడమే ఇందుకు కారణం.  పోనీ ఇండియా కూటమి అయినా ఐక్యంగా ఉందా అంటే అదీ లేదు. కాబట్టి మళ్లీ బీజేపీదే అధికారం అన్న భావన దేశమంతా నెలకొంది. అయితే మళ్లీ మోదీ గెలిస్తే..  దేశంలో ప్రజాస్వామ్యంప్రమాదంలో పడిందని నియంతృత్వందిశగా వెళ్లే అవకాశముందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.


రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దేవుళ్ల పేరు చెప్పుకొని ప్రధాని మోదీ ఓట్లడుగుతున్నారంటూ రేవంత్‌ రెడ్డి దుయ్యబట్టారు. ఆర్మూర్‌, నిజామాబాద్‌లో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారగడువు రెండురోజుల్లో ముగుస్తుండటంతో  కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది.  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.


పసుపుబోర్డుపై నిజామాబాద్ రైతులను బీజేపీ నమ్మించి మోసం చేసిందని... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతుగా ఆర్మూర్‌లో రోడ్‌షోలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి .. బీజేపీ, బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఆ పార్టీల నుంచి ఎంపీలుగా ఎన్నికైన వారు నియోజకవర్గానికి చేసిందేంలేదని సీఎం రేవంత్ రెడ్డి  మండిపడ్డారు.


చక్కర పరిశ్రమ తెరిపించని కవితని ఓడించిన ప్రజలు... పసుపు బోర్డు ఏర్పాటుచేయని అర్వింద్‌ను ఎందుకు గెలిపించారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్‌కి ఇచ్చిన హామీల్లో ఏఒక్కటీ నెరవేర్చలేదన్న సీఎం రేవంత్‌... దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. రిజర్వేషన్లను ఎందుకు రద్దు చేయాలని చూస్తున్నారో ప్రజలకు చెప్పాలంటూ... అర్వింద్‌ను, ప్రధాని మోదీని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కవితకు బెయిల్‌ కోసం... కేసీఆర్‌... బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నారని.. రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ గెలుపు కోసం.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కేసీఆర్‌ పణంగా పెడుతున్నారని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: