గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ క్రియాశీలకంగా పనిచేసింది. ఓ రకంగా వారు జగన్ కి ఒక సైన్యంలాగా వ్యవహరించారు. కానీ తాజా ఎన్నికల ముందు వారికి ఈసీ ఝలక్కిచ్చింది. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండమని ఆదేశించడంతో వారితో వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామా చేయించి బరిలోకి దింపారు. కానీ పాచిక పారలేదు. తాజా ఎన్నికల్లో వైస్సార్సీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ కొనసాగబడుతుందని, అదే విధంగా వాలంటీర్ జీతం 10వేలు చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది.

ఈ క్రమంలో తాజాగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మంత్రి బాల వీరాంజనేయ స్వామికి వాలంటీర్ వ్యవస్థ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్ల విషయం ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. దాంతో రాజీనామాలు చేసిన వాలంటీర్లు ప్రస్తుతం రోడ్లపైకి వచ్చి తమ గోడుని విన్నవించుకుంటున్నారు. ఇందులో భాగంగా వారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని టీడీపీ నాయకుల దగ్గర వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో వాలంటీర్లకు మంత్రి అచ్చెన్నాయుడు ఓ ఉచిత సలహా పడేసారు. రాజీనామాలు చేయించినవారిపై కేసులు పెట్టమని వాలంటీర్లకు ఎదురు సలహాలు ఇచ్చారు. వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని మెరపెట్టుకుంటున్న వాలంటీర్లకు అచ్చెన్నాయుడు... మీతో ఎవరైతే బలవంతంగా రాజీనామాలు చేయించారో వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని.. ఆ తర్వాత తనను కలవాలని.. అప్పుడు ఆలోచిద్దామని సూచించారు. దాంతో ఈ అంశం ఇపుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామాలు చేసిన వాలంటీర్లపై ప్రభుత్వం ఎలా స్పందించబోతోందనేది వేచి చూడాలి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆల్రెడీ రిజైన్ చేసినవారిని పక్కనబెడుతూ రిజైన్ చేయనివారిని విధుల్లో కొనసాగేలా చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: