
ఈ S-400 అంటే రష్యా తయారుచేసిన ఒక అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. దీన్ని కొనడానికి 2018లో రష్యాతో మన దేశం 5 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది. మొత్తం ఐదు S-400 యూనిట్లు మనకొచ్చాయి. అయితే, ఈ S-400 కొనుగోలు ప్రక్రియ 2016లోనే మొదలైంది. అప్పటి మన రక్షణ మంత్రి మనోహర్ పారికర్. ఆయన దూరదృష్టితో వేసిన అడుగే ఇది. ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా, ఆయన తెచ్చిన ఈ అస్త్రమే ఇప్పుడు దేశానికి శ్రీరామరక్షగా నిలుస్తోంది. అందుకే "ఆయన చనిపోయినా దేశాన్ని కాపాడుతూనే ఉన్నారుగా?" అని అన్నాం.
ఈ S-400 సిస్టమ్ గాల్లో వచ్చే ఎలాంటి ముప్పునైనా పసిగట్టేస్తుంది, ట్రాక్ చేస్తుంది, తునాతునకలు చేసేస్తుంది. ఇందులో మూడు ముఖ్య భాగాలుంటాయి. మిస్సైల్ లాంచర్లు, ఒక పవర్‌ఫుల్ రాడార్, ఒక కమాండ్ సెంటర్. దీని రాడార్ ఎంత పవర్‌ఫుల్ అంటే, ఏకంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను కూడా పట్టేస్తుంది. అంటే, శత్రువుల యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, చివరికి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు కూడా మన గగనతలంలోకి రాకముందే వాటిని గుర్తించి, గాల్లోనే పేల్చేస్తుంది. దీని దెబ్బకు నాటో (NATO) దేశాలు కూడా బెంబేలెత్తిపోతాయి.
మిలిటరీ వాళ్లు దేశ భద్రత చూసుకుంటుంటే, ఈ టెన్షన్ మిగతా రంగాలపై కూడా పడింది. మే 9న రిలీజ్ కావాల్సిన రాజ్‌కుమార్ రావు నటించిన "భూల్ చుక్ మాఫ్" సినిమా విడుదల ఆగిపోయింది. స్పోర్ట్స్ విషయానికొస్తే, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ డ్రోన్, మిస్సైల్ దాడి వల్ల కరెంట్ పోయి ఆగిపోయింది. దీంతో మొత్తం ఐపీఎల్ టోర్నమెంట్‌నే నిలిపివేశారు.
భారత్ ఇప్పుడు ఈ S-400 వ్యవస్థను వాడటం చూస్తుంటే, పెరుగుతున్న ముప్పుల నుంచి దేశాన్ని కాపాడుకోవడంలో ఇది ఎంత కీలకమో అర్థమవుతోంది. మనోహర్ పారికర్ మనకు అందించిన ఈ "రక్షణ కవచం" విలువ ఇప్పుడు మనందరికీ స్పష్టంగా తెలుస్తోంది. ఆయన దూరదృష్టికి, దేశభక్తికి మనందరం సెల్యూట్ చేయాల్సిందే.