ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సీరియస్ మలుపు తలెత్తనుందా ? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్పష్టంగా చెప్పారు .. "ఇకపై మరో ఎత్తు." ఈ వ్యాఖ్య ఒకటే ప్రస్తుతం పార్టీ వర్గాల్లో, రాజకీయ విశ్లేషకుల్లో, మీడియా చర్చల్లో భారీ చలనం సృష్టిస్తోంది. ఈ మాటల వెనుక మంత్రుల మార్పు సూత్రం దాగి ఉందని అంతా విశ్వసిస్తున్నారు. మొదట్లోనే స్పష్టంగా చెప్పాలి - చంద్రబాబు దృష్టి ఇప్పుడు మంత్రివర్గ పనితీరుపైనే. కొన్ని కీలక మంత్రులు – వారు కొత్తవారైనా, సీనియర్లైనా – ఆయన్ని మెప్పించలేకపోతున్నట్టు తెలుస్తోంది. అందులో ఇద్దరు సీనియర్ మంత్రులు - కొలుసు పార్ధసారధి, ఆనం రామనారాయణ రెడ్డి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొలుసు పార్ధసారధి 2019 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయనకు అక్కడ మంత్రి పదవి రాలేదు అన్న అసంతృప్తితో ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఆయనకు ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన బాబు, గృహ నిర్మాణ శాఖ, HUDCO, TIDCO, వంటి కీలక శాఖలు కేటాయించారు.


 కానీ పార్టీ అంతర్గతంగా - "పార్ధసారధి పనితీరు వేగంగా లేదు", "వైసీపీపై విమర్శల డోస్ తక్కువగా ఉంది", "పబ్లిక్ కమ్యూనికేషన్ అటాక్ లో లేదు" అనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో ఆయనపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని, ఆయన శాఖలు మారే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. నెల్లూరు జిల్లాలో పొలిటికల్ వెటరన్ అయిన ఆనం, కాంగ్రెస్ కాలంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం వైసీపీలో చేరినా అక్కడ సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోయారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు, విజయం సాధించాక చంద్రబాబు ఆయనకు దేవాదాయ శాఖ కేటాయించారు. కానీ ఆనం వంటి అనుభవజ్ఞుడికి ఈ శాఖ తక్కువ ప్రాధాన్యత ఉన్నదిగా కనిపిస్తూ ఉండటం వల్ల ఆయనలో ఒక అంతర్గత అసంతృప్తి ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మంత్రి నారాయణ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు ... ఈ పరిస్థితుల్లో ఆయన నేరుగా పదవి పోగొట్టుకోకపోయినా, శాఖ మారే అవకాశం ఉందన్న ఊహాగానాలు వ‌స్తున్నాయి. గత 5 సంవత్సరాల పాటు టీడీపీకి నిబద్ధతతో పని చేసిన నాయకులకు మంత్రి పదవి ఇవ్వలేదు అన్న అసంతృప్తి రాష్ట్రవ్యాప్తంగా ఉంది.


ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలు - "ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చినవారికి మంత్రి  పదవులు ఇవ్వడం న్యాయమా?" అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకే చంద్రబాబు ప్రస్తుతం విశ్లేషణాత్మక నిర్ణయానికి సిద్ధమవుతున్నారంటూ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చంద్రబాబు చాలా సందర్భాల్లో "పరస్పర సంతృప్తి" అనే సిద్ధాంతాన్ని పాటిస్తారు. మంత్రి పదవిని తొలగించకుండా, శాఖ మారుస్తారనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే "పనితీరు ఆధారంగా ఉన్నంతటితో తీసివేస్తారనే గట్టి టాక్ కూడా ఉంది", ముఖ్యంగా నాయకత్వ నాణ్యత కంటే పార్టీకి నమ్మకం ఎక్కువగా చూపినవారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న దృక్కోణం బలపడుతోంది . కొలుసు - ఆనం ఇద్దరూ రాజకీయంగా అనుభవం కలిగిన వారు. కానీ పార్టీలో పరస్పర విశ్వాసం, శక్తివంతమైన ప్రజా వ్యవహార నెపథ్యంలో వారి పాత్రపై పునర్విచారణ జరుగుతోంది. మంత్రివర్గ మార్పులో మొదటి దెబ్బ ఎవరికి పడుతుంది ? చంద్రబాబు వినూత్న వ్యూహానికి తెరలేపుతారా లేక సర్దుబాటు మార్గం ఎంచుకుంటారా ?   అన్నదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్.

మరింత సమాచారం తెలుసుకోండి: