ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వినూత్న దృశ్యం నడుస్తోంది. ఇది దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో కనిపించని మాదిరి. అధికారంలో ఉన్నవారిపై ప్రతిపక్షం, ప్రతిపక్షంపై అధికార పార్టీ… అరెస్టుల కల్లకల్లా రాజకీయాల్లో ఓ కొత్త టర్న్ తీసుకుంది. “వారు అధికారంలో ఉంటే వీరిని అరెస్ట్ చేస్తారు, వీరికి అధికారమిస్తే వారిని అరెస్ట్ చేస్తారు” అన్న స్థాయిలో ఎదురు దాడులుగా వ్యవహారాలు సాగుతున్నాయి. అవినీతికి సంబంధించిన కేసులు, అక్రమ ఆస్తుల ఆరోపణలు… ఇవన్నీ అరెస్టులకు బేస్ గా మారుతున్నా, అసలు వాటిపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అన్నది చర్చనీయాంశమైంది. వాస్తవానికి ప్రజలు అవినీతి కేసులను పెద్దగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని స్కాంలు బయటపడినా – ఎన్నికల తీర్పు మాత్రం వాటిపై ఆధారపడడం లేదు. 2024 ఎన్నికల ఫలితమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. జగన్ సంక్షేమ పాలనను చంద్రబాబు రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి అజెండాను కూడా కలిపి ప్రచారం చేశారు.


ఇక మరోవైపు చంద్రబాబు మీద జరిగిన అరెస్టు, 75 ఏళ్ల వయసులో 53 రోజులు జైలులో ఉండటం ఆయనకు అద్భుతమైన సానుభూతిని తెచ్చిపెట్టింది. ఫలితంగా వైసీపీ 11 సీట్లకు పరిమితం కాగా, టీడీపీ కూటమి అధికారం సాధించింది. ఇక జగన్ హయాంలో అరెస్టయిన టీడీపీ నేతలు – అచ్చెన్నాయుడు, కొల్లు ర‌వింద్ర‌  వంటి నేతలు – ప్రస్తుతం మంచి మెజారిటీలతో గెలిచి తిరిగిరాగలిగారు. ఇప్పుడు అదే ఫార్ములా వైసీపీ కూడా అనుసరిస్తుందనేది విశ్లేషకుల అంచనా. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారానికి వచ్చిన సానుభూతిని జగన్ తనకూ వస్తుందని వైసీపీ వర్గాల్లో విశ్వాసం కనిపిస్తోంది. ఇటీవల చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మిధున్ రెడ్డి అరెస్టులు ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక తాను అరెస్టుకై సిద్ధంగా ఉన్నానని జగన్ స్వయంగా మీడియా ముందు చెప్పిన తీరు చూస్తే, ఇది ముందస్తు వ్యూహమని అనిపిస్తోంది.


ప్రత్యేకించి లిక్కర్ స్కామ్ కేసులో జగన్ అరెస్టైతే... అతికొద్ది అంటే రెండు నుంచి మూడు నెలల జైలుశిక్ష అనుకున్నా, అది రాజకీయంగా లాభంగా మారుతుందని వైసీపీ భావిస్తోంది. జైలు అనేది పాత రాజకీయాల్లో భయానకమైన పదంగా ఉన్నా, ఇప్పుడు రాజకీయ దిగ్గజాలన్నీ జైలు వెళ్లినవారే కాబట్టి, ప్రజల్లో కక్షపూరిత ధోరణిపై విరక్తి పెరిగిపోయింది. అవినీతి ఆరోపణలు ఉంటే ఎన్నికల్లో ఓడిపోతారు అనే నమ్మకం ఇక లేదు. జగన్ మీద 2014, 2019 ఎన్నికల్లోనూ లక్షల కోట్ల అవినీతి ఆరోపణలున్నా ఆయన గెలవగలిగిన దానికే నిదర్శనం. ఇపుడు అదే పంథాలో వైసీపీ నేతలు కూడా నడుస్తున్నారు. అరెస్టుల పట్ల భయాన్ని పక్కనపెట్టి, జైలు అనంతరం రాజకీయ సానుభూతిని సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. "జైలు అనేది ఓ ట్రెండ్"గా మారిపోయిన ఈ రాజకీయ వాతావరణం... ఇకపై ఏపీలో కొత్త రాజకీయ తరహాను తీసుకురాబోతున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: