
ఇక వీధి కుక్కల దాడులు ఇటీవల దేశవ్యాప్తంగా పెరిగిపోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో రెండేళ్ల చిన్నారి పై కుక్క దాడి చేసి రేబిస్ సోకడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ చిన్నారిని కరవకపోయినా కుక్క నాకడంతోనే రేబిస్ సోకడం తల్లిదండ్రులను, స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఇలాంటి విషాదాలు తరచూ జరగడం సుప్రీంకోర్టు దృష్టిని ఆకర్షించడంతో, తక్షణ చర్యలు అవసరమని న్యాయస్థానం భావించింది. అంతేకాదు, వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కొత్త గైడ్‌లైన్స్ను కూడా ఇచ్చింది. రేబిస్ లేదా అసహజ ప్రవర్తన ఉన్న కుక్కలను మాత్రం శాశ్వతంగా షెల్టర్లలోనే ఉంచాలని ఆదేశించింది. మిగతావాటిని టీకాలు వేసి, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత తిరిగి వాటిని ఉన్న ప్రదేశాల్లో వదిలేయాలని సూచించింది. ఈ ఆదేశాలను దేశవ్యాప్తంగా రాష్ట్రాల సీఎస్‌లు అమలు చేయాలని త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది.
ఈ తీర్పు మీద పశుప్రేమికులు, సామాన్య పౌరుల మధ్య విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ తీర్పును "మానవుల భద్రతను కాపాడే దిశగా తీసుకున్న అద్భుత నిర్ణయం" గా అభివర్ణిస్తుండగా, మరికొందరు మాత్రం "కుక్కలకు బహిరంగంగా ఆహారం ఇవ్వడాన్ని నిషేధించడం అన్యాయం " గా విమర్శిస్తున్నారు. ఏదేమైనా.. సుప్రీంకోర్టు స్పష్టమైన గైడ్‌లైన్స్ జారీ చేయడంతో ఇప్పుడు వీధి కుక్కల సమస్యపై ఒక స్పష్టత వచ్చినట్లైంది. రాబోయే రోజుల్లో ఈ తీర్పు ఎలా అమలు అవుతుందో, పౌరుల భద్రతకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.