తెలుగుదేశం పార్టీలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. సాధారణంగా జూనియర్లు తప్పు చేస్తే వారిని మందలించడం, మార్గం చూపించడం సులభమే. కానీ, అదే తరహాలో సీనియర్లు, ముఖ్యంగా కీలక హోదాల్లో ఉన్న నేతలు ప్రవర్తిస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యవహారం ఈ చర్చను మరింత వేడెక్కించింది. రాజ్యాంగబద్ధమైన హోదా కలిగిన స్పీకర్ స్థానానికి గౌరవం, ప్రతిష్ట ఉంటుంది. ఇప్పటివరకు ఏపీలో ఉన్న స్పీకర్లు తమ ప్రవర్తనతో ఆ ప‌ద‌వికి వ‌న్నె తెచ్చారు. కొందరిపై విమర్శలు వచ్చినా రాజ్యాంగపరమైన గౌరవాన్ని దెబ్బతీయలేదు. అయితే, అయ్యన్న పాత్రుడు వీడియో ఒక‌టి బయటకు రావడం, అందులో ఆయన నోటి దురుసు వినిపించడం వల్ల ఈసారి పరిస్థితి మారిపోయింది.


సోష‌ల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడంతో, దానికి ఎటువంటి వివరణ చెప్పినా సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు "నకిలీ వీడియో" అని ఆరోపిస్తూ తప్పించుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. స్పష్టమైన సాక్ష్యాలతో ప్రజల ముందుకు వచ్చిన ఈ వీడియో ఆయ‌న వ్యక్తిత్వంపై, ముఖ్యంగా స్పీకర్ హోదాపై ర‌క‌ర‌కాల సందేహాల‌కు కార‌ణ‌మైంది. ఇది వ్యక్తిగతంగా అయ్యన్న పాత్రుడికి పెద్ద సమస్య కాకపోయినా, పార్టీ ఇమేజ్ పరంగా మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే, చంద్రబాబు స్వయంగా నేతలందరికీ క్రమశిక్షణ, గౌరవంగా ఉండాల‌ని బహిరంగంగా పిలుపునిచ్చిన కొద్ది గంటల్లోనే ఈ వీడియో బయటకు రావడం అనేది పార్టీ శ్రేణుల్లోనూ అసంతృప్తిని రేకెత్తించింది.


సీనియర్లు, ముఖ్యంగా బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్న నేతలు ఇలా ప్రవర్తిస్తే, జూనియర్లకు ఎలా మార్గదర్శనం చేయగలరు? పార్టీకి, ప్రభుత్వానికి మేలు చేయాల్సిన వారు తారుమారైన వ్యాఖ్యలు చేస్తే, ఎవరిని ప్రశ్నించాలి అన్నది ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ప్రధాన చర్చ. కోడెల శివప్రసాదరావు, తమ్మినేని సీతారాం వంటి స్పీకర్లు కొన్ని విమర్శలకు గురైనా, ఇలాంటి వ్యక్తిగత వివాదాలకు తావివ్వలేదు. కానీ అయ్యన్న వీడియో వల్ల స్పీకర్ ప్రతిష్టకే నష్టం జరిగిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద, ఈ ఘటన చంద్రబాబుకు కొత్త తలనొప్పి తెచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: