ఏపీలో ఈసారి దసరా పండుగ పేదల కోసం నిజమైన పండుగగా మారబోతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు తన పాలనలో మార్పులు తీసుకువస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమాంతరంగా నడిపిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సమయం పట్టినా, ఈసారి మాత్రం వేగంగా అమలు చేస్తూ పేదలకు నేరుగా మేలు చేకూరుస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా పేదలకు సొంత ఇల్లు కల నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. దసరాకు మూడు లక్షల ఇళ్లు .. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత పెద్ద లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకున్నది దసరా నాటికి మూడు లక్షల ఇళ్ళ గృహ ప్రవేశం చేయించడం. ఇప్పటికే అధికారులను పూర్తి వేగంతో పనిచేయమని బాబు ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు లక్షల ఇళ్ళను పేదలకు అందించి, వారితో దసరా పండుగను నిజమైన పండుగగా మార్చాలని సంకల్పం. ప్రస్తుతం నెల రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి.


సంక్రాంతికి మరో రెండు లక్షలు .. దసరా తర్వాత కూడా ఆగని సంక్షేమం సంక్రాంతి పండుగకు మరోసారి పేదలకు సంతోషం కలిగించనుంది. సంక్రాంతి వేళ మరో రెండు లక్షల ఇళ్లు లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అంటే వచ్చే ఏడాది పండుగ సమయంలో సొంత ఇంట్లోనే పాలు పొంగించి పండగ జరుపుకునే అవకాశం లక్షలాది కుటుంబాలకు దక్కనుంది. ఆర్థిక సంవత్సరం లక్ష్యం .. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా మరో అయిదు లక్షల ఇళ్లు పూర్తి చేసి పేదలకు కేటాయించాలని లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఆరు నెలల్లో మొత్తం పది లక్షల ఇళ్లు అందజేయడం జరుగుతుంది. అంటే కనీసం యాభై లక్షల మందికి పైగా పేదలకు శాశ్వత ఇల్లు కల్పించడం జరుగుతుంది. ఇది దేశంలోనే ఒక రికార్డుగా నిలుస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

నిధుల కేటాయింపులో జాగ్రత్తలు .. ఇళ్ల నిర్మాణం విషయంలో ఎక్కడా అవాంతరాలు లేకుండా ఉండేలా ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంటోంది. అవసరమైన నిధులను సమయానికి మంజూరు చేస్తూ, అధికారులకు స్పష్టమైన ఆదేశాలను ఇస్తోంది. అందువల్ల ఈసారి గృహప్రవేశం విషయంలో ఎలాంటి అడ్డంకులు ఉండబోవని చెబుతున్నారు. పేదలకు శుభవార్త .. సొంత ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ఈ ప్రణాళికలు నిజమైన శుభవార్త. దసరాసంక్రాంతి వేళలలో లక్షలాది కుటుంబాలు తమ సొంత ఇళ్లలో అడుగుపెడతారు. దీంతో చంద్రబాబు – పవన్ కూటమి ప్రభుత్వం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటుందనడంలో సందేహం లేదు. మొత్తానికి, ఈ దసరా నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు పేదలకు సొంత గూడు కల్పించడం ద్వారా చంద్రబాబు పాలన “సంక్షేమం + అభివృద్ధి” రెండింటినీ సమతుల్యంగా నడిపిస్తోందని చెప్పాలి. ఇది కూటమి ప్రభుత్వానికి మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: