ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. పార్టీని బలోపేతం చేయడానికి, గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో నాయకత్వ మార్పులపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. ఈ నెల మూడో వారంలో ఆయన పిఠాపురంలో పర్యటించి, స్థానిక నాయకులతో సమావేశమై, పార్టీ నిర్మాణాన్ని మరింత చురుకుగా మార్చే ప్రయత్నం చేయనున్నారని సమాచారం. దీనివల్ల జనసేన సంస్థాగతంగా మరింత బలపడే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఈ మార్పులు రాజకీయంగా కొత్త స‌మీక‌ర‌ణ‌ల‌కు తెర‌లేవ‌నున్నాయి. ఇప్పటివరకు పిఠాపురంలో టిడిపి బలమైన పట్టు కలిగి ఉంది. గత ఎన్నికల్లో టిడిపి నేత వర్మ టికెట్‌ త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు. ఇప్పుడు ఆయన మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేయాలన్న ఆలోచ‌న‌తో ఉన్నార‌ని తెలుస్తోంది. కానీ నియోజ‌క‌వ‌ర్గంలో జనసేన బలపడుతున్న పరిస్థితుల్లో వర్మకు అవకాశాలు తగ్గిపోతున్నాయని పరిశీలకుల అంచనా.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురంపై పూర్తి దృష్టి పెట్టడం, పార్టీని పునర్‌వ్యవస్థీకరించేందుకు ప్రయత్నించడం వల్ల టీడీపీకి ఇక్కడ స్థానం దక్కడం కష్టమనే భావన బలపడుతోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేస్తార‌ని జనసేన నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల టిడిపి వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది.
గత ఎన్నికల్లో వర్మను పార్టీ వదిలేయడం ఆయనకు తీవ్ర నిరాశ కలిగించింది. చంద్రబాబు అప్పట్లో ఆయనకు ఎమ్మెల్సీని చేస్తాన‌ని భరోసా ఇచ్చినా, ఇప్పుడు ఆ హామీ నెర‌వేర‌లేద‌ని ఆయన వర్గం అంటోంది. ఇక జనసేన బలపడటంతో వర్మకు రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించకపోతే వ‌ర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక మరోవైపు చంద్రబాబు ఈ అంశంపై మౌనం పాటించడం గమనార్హం. ఆయన టిడిపి భవిష్యత్ వ్యూహంలో పిఠాపురం ప్రాధాన్యం తగ్గిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద పిఠాపురం రాజకీయాలు మరోసారి వేడెక్కేలా ఉన్నాయి. ఇక్క‌డ ప‌వ‌న్ వేస్తోన్న బలమైన అడుగులు, టిడిపి వ‌ర్మ‌ లోపల పెరుగుతున్న అసంతృప్తి ఈ రెండు కారణాల వల్ల రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం రాజకీయంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: