మైలవరం శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత శాసనసభ్యుడు (ఎమ్మెల్యే) వసంత కృష్ణ ప్రసాద్, ఎన్నికలకు దాదాపు మూడున్నర సంవత్సరాల ముందే సంచలన ప్రకటన చేశారు. వచ్చే 2029 ఎన్నికల్లో కూడా మైలవరం నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించుకున్నారు. ఈ ప్రకటన ఒకరకంగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకు గట్టి హింట్ ఇచ్చింది. మైలవరాన్ని తాను వదిలిపెట్టేది లేదని వసంత స్పష్టం చేయడంతో టీడీపీలో అంతర్గత రాజకీయం రాజుకుంది. పార్టీలో సీరియస్: ధిక్కారంగా ఉమ వర్గీయుల ఆరోపణ .. ఎన్నికలు 2029లో ఉన్నప్పటికీ, అప్పుడే అభ్యర్థిని తానే అని వసంత ప్రకటించుకోవడంపై పార్టీ నాయకత్వం కూడా ఒకింత సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ఎన్నికల సమయంలో పొత్తులు ఉంటాయి. అంతేకాకుండా, అప్పటి రాజకీయ పరిస్థితులు, గెలుపు అవకాశాలను అంచనా వేసి అభ్యర్థిని నిర్ణయిస్తారు. అయితే, వసంత కృష్ణ ప్రసాద్ ఈ విధంగా ముందస్తు ప్రకటన చేయడం 'ధిక్కారం' అవుతుందని దేవినేని ఉమ వర్గీయులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

మూడోసారి 'మైలవరం నాదే': జోగి రమేష్‌కి కౌంటర్!
వసంత కృష్ణ ప్రసాద్ 2019లో వైఎస్సార్సీపీ తరఫున మైలవరం నుంచి విజయం సాధించారు. 2024 ఎన్నికల ముందు వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరి, టిక్కెట్ సంపాదించి, 43 వేల భారీ మెజారిటీతో తిరిగి గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి కూడా తానే పోటీ చేస్తానని ప్రకటించడం ద్వారా ఆయన తన పట్టును నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రకటన చేయడానికి ప్రధాన కారణం... ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి జోగి రమేష్ (వైఎస్సార్సీపీ) "వచ్చేసారి మైలవరం నుంచి నేను పోటీ చేసి, వసంతను ఓడిస్తా" అని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా వసంత ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. కౌంటర్ రూపంలో ఉన్నప్పటికీ, ఇది ఆయన మనసులో మాట చెప్పకనే చెప్పినట్లయింది. అంటే, దేవినేని ఉమను ఈసారి కూడా మైలవరం నియోజకవర్గంలోకి ఎంటర్ కానివ్వబోనని వసంత పరోక్షంగా చెప్పకనే చెప్పారు.

ఉమ భవిష్యత్తుపై సస్పెన్స్!
దేవినేని ఉమ టీడీపీలో సీనియర్ నేత, చంద్రబాబు మరియు లోకేశ్‌లకు అత్యంత సన్నిహితుడు. గత ఎన్నికల్లో స్థానిక నేతల వ్యతిరేకత కారణంగా ఆయనకు టిక్కెట్ దక్కలేదు. అయినప్పటికీ ఆయన పార్టీలోనే నమ్మకంగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ వస్తుందని ఉమ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అయితే, నియోజకవర్గాల పునర్విభజన జరిగి, నందిగామ నియోజకవర్గం జనరల్‌గా మారితే, దేవినేని ఉమ అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ పునర్విభజన జరగకపోయినా, మైలవరం నాదేనని వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించడంపై దేవినేని ఉమ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు టీడీపీలో ఉత్కంఠగా మారింది. పార్టీ హైకమాండ్‌కు సన్నిహితుడైన ఉమ, ఈ ధిక్కార ప్రకటనపై ఎలాంటి రాజకీయ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: