మనం ఇప్పటి వరకు బైక్ రేసింగ్ లు, కారు రేసింగ్ లు, గుర్రాల రేసింగ్ లు, ఇతరాత్ర కొన్ని జంతువుల రేసింగ్ లు మాత్రమే చూసి ఉంటాం. కానీ పావురాల రేసింగ్ ఇప్పటివరకు మనం చూడలేదు. వినలేదు కూడా.. ఆ రేసింగ్ ఎక్కడో..? ఎలా జరుగుతుందో తెలుసుకుందాం..? కొన్ని దేశాల్లో ప్రతి ఏడాది పావురాల యొక్క రేసింగ్ నిర్వహిస్తుంటారు. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా. ఈ రేసింగ్ లో పాల్గొనే పావురాలకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ ట్రైనింగ్ ఇచ్చిన పావురాలను హోమింగు పావురాలు అంటారు.  ఈ రేసింగ్ లను వంద కిలోమీటర్ల నుంచి మొదలు వెయ్యి కిలోమీటర్ల వరకు దూరాన్ని పెట్టి పోటీ నిర్వహిస్తారు. ఈ పోటీలో పావురాలు నిర్దిష్ట దూరం చేరుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికే వచ్చేస్తాయి.

 ఇదే మాదిరిగా యూకేలో అనేక ప్రాంతాల్లో పిజియన్స్ రేస్ నిర్వహించగా అందులో పాల్గొన్నటువంటి దాదాపు నలభై శాతం పైగా పావురాలు  మళ్లీ ఇంటికి రాకుండా కనిపించ కుండా పోవడం మిస్టరీగా మారింది. అయితే యూకే వ్యాప్తంగా జరిగిన  50 రేసింగ్ పోటీల్లో పాల్గొన్న రెండు లక్షలకు పైగా పావురాలలో దాదాపు నలభై శాతం తిరిగి వెనక్కి రాలేదు. మిస్సయిన  మొత్తం పావురాల సంఖ్య లెక్కకు చిక్కలేదని రేసింగ్ నిర్వాహకులు అంటున్నారు. ఇక పీటర్ బోరోలో జరిగిన  రేసింగ్లో  తిరిగిరాని పక్షుల సంఖ్య ఐదు నుంచి పది వేలకు పైగానే ఉంటుందని నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇలాంటి సంఘటన ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదని పావురాలను పెంచుకున్న యజమానులు అంటున్నారు. తుఫాను సూచనల వల్ల, వాతావరణం లో జరిగిన అనేక మార్పులతో పావురాలు దారి తప్పిపోయి ఉంటాయని మరి కొందరు భావిస్తున్నారు.

ఈ పావురాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినప్పటికీ వాతావరణంలో జరిగే పరిస్థితులతో అవి అలసిపోయి ఉంటాయని, ఒకవేళ ఎక్కడైనా పడిపోయినా, గుంపులు గుంపులుగా కనిపించినా వాటికి నీళ్లు, ఆహారం అందించమని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. అయితే వీటిని పెంచుకున్న యజమానులు అవి రేసు  పావురాలని, వాటి కాళ్ళకు రింగులు కూడా ఉంటాయని, వీటితో ఎలాంటి హానీ ఉండదని ఎవరు కూడా భయపడకుండా చేరదీయాలని వారు పేర్కొంటున్నారు. కొద్దిరోజుల తర్వాత ఇవి  80% తమ దారిలోకి వచ్చే అవకాశం ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను, నివారించడానికి రాయల్ పావురం రేసింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎవన్స్ వాతావరణ పరిస్థితులపై నివేదికను పొందడానికి యూకే జాతీయ వాతావరణ శాఖతో చర్చలు జరపనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: