శ్రీలంక పర్యటనలో భారత్ ఘోర పరాజయం నమోదు చేసింది. గెలిచి తీరాల్సిన ఆటలో దారుణమైన ఆట తీరుతో ఓటమి పాలైంది. కొలంబోలో జరిగిన చివరి టీ-20లో భారత్‌పై శ్రీలంక విజయం సాధించింది. మూడో టీ-20లో భారత్‌పై శ్రీలంక 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్‌పై 2-1 తేడాతో సిరీస్‌ గెలిచింది శ్రీలంక.


గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆటతీరు ఏ దశలోనూ ఆశాజనకంగా కనిపించలేదు. ఆది నుంచి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడనే తలపిస్తూ సాగింది. ఆటలో టాస్ గెలవడం మినహా భారత్ ఏ దశలోనూ సంతోషంగా కనిపించలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. చాలా కాలం తర్వాత తక్కువ స్కోరు నమోదు చేసింది. 8 వికెట్లు కోల్పోయిన టీమిండియా కనాకష్టంగా 81  పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఆట ఆరంభం నుంచే.. పిచ్ బౌలర్లకు బాగా అనుకూలించింది.  అలాంటి పిచ్ పై పరుగులు చేసేందుకు భారత బ్యాట్స్ మెన్ బాగా ఇబ్బంది పడ్డారు. ఆరంభంలోనే మొదటి ఓవర్‌లోనే  కెప్టెన్ ధావన్ క్యాచ్ ఇచ్చి అవుటైపోయాడు. ఇక పడిక్కల్ కేవలం 9 రన్స్ చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత ఎవరకూ గట్టిగా నిలబడలేకపోయారు. సంజు శాంసన్ కూడా ధావన్ తరహాలోనే పరుగులేమీ చేయకుండానే హసరంగ బౌలింగ్ లో వెనుదిరిగాడు.


ఆ తర్వాత గైక్వాండ్‌  2 బౌండరీలతో కాసేపు ఆశలు రేకెత్తించినా.. ఆ తర్వాత 14 రన్స్ చేసి ఆయన కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన నితిష్ రాణా ఆరు పరుగులకే ఔటయ్యాడు. భువనేశ్వర్, కులదీప్ జోడీ కొద్దిసేపు ఆడి మరోసారి ఆశలు రేకెత్తించారు. అయితే.. 16 రన్స్ చేసిన భువనేశ్వర్ ను హసరంగ అవుట్ చేశాడు. రాహుల్ చాహర్ 5 పరుగులు చేసి అవుటయ్యాడు.


మొత్తం మీద టీమిండియా బ్యాట్స్ మెన్ లో ముగ్గురు మాత్రమే రెండకెల స్కోరు చేశారు. మూడు డకౌట్లు. ఇక భారత్ ఇచ్చిన 82  పరుగుల టార్గెట్ ను శ్రీలంక కేవలం మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. మరో 33 బంతులు మిగిలుండగానే శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా 8 టీ-20 సిరీస్‌ విజయాల తర్వాత భారత్‌ ఓటమి పాలైతే.. వరుసగా 5 టీ-20 సిరీస్‌ ఓటముల తర్వాత శ్రీలంక విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: