’ఎద్దు ఈనిందనగానే దూడను కట్టేయ’మన్నాడట వెనకటికెవడో. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు వ్యవహారం కూడా అచ్చం ఇలాగే ఉంది. వైసిపి ప్రభుత్వం అనధికారికంగా, ప్రైవేటు వ్యక్తులతో ఫోన్ ట్యాపింగ్ చేయిస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడి, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశాడు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా అనధికారికంగా ప్రభుత్వం న్యాయమూర్తులు, రాజకీయనేతలు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందంటూ ఫిర్యాదులో చెప్పారు. బాగానే ఉంది తన ఫిర్యాదుకు, ఆరోపణలకు ఆధారాలేమన్నా ఇచ్చారా అంటే అదేమీలేదు. జస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లేయటమే. ఫోన్ ట్యాపింగ్ ప్రజాస్వామ్యానికి ఏ విధంగా ప్రమాదమో, చట్టాలను ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారనే విషయాన్ని కూడా చంద్రబాబు తన లేఖలో స్పష్టంగా చెప్పారు.
ఇంతపెద్ద లేఖ రాసిన చంద్రబాబు తన ఆరోపణలకు సరైన ఆధారాలను ఇవ్వాలన్న కనీస ఇంగితాన్ని కోల్పోయాడు. అసలింతకూ చంద్రబాబు రాసిన లేఖకు ఆధారం ఏమిటి ? ఏమిటంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనం. అసలా కథనమే తప్పులతడకగా ప్రభుత్వం తేల్చేసింది. అన్నీ కల్పితాలతో ఎల్లోమీడియాగా ప్రచారంలో ఉన్న ఆంధ్రజ్యోతిలో కథనం రావటం దాన్ని చంద్రబాబు, టిడిపి నేతలు పట్టుకుని ఊగలాడటం చూస్తుంటే వాళ్ళమధ్య ఉన్న బంధం ఎంత గట్టిదో అందరికీ తెలిసిపోతోంది. ఎల్లోమీడియాలో వచ్చిన కథనంలోనే ఎక్కడా ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందనేందుకు ఆధారాల్లేవు. కథనం మొత్తం ఆవు వ్యాసం రాసినట్లే ఉంది. ఆరుగురు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు రాసిందే కానీ వాళ్ళ పేర్లు రాయలేదు. నిజంగానే ఫోన్లు ట్యాప్ అయ్యుంటే న్యాయమూర్తులు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఊరుకుండేవారేనా ?
ఫోన్ల ట్యాపింగ్ పై కథనం వచ్చి 48 గంటలు దాటిపోయినా హైకోర్టు సూమోటోగా ఎందుకు విచారణ మొదలుపెట్టలేదు ? విచారణ చేయించేందుకు తనకు అవకాశాలు లేవనుకున్నపుడు కేంద్ర దర్యాప్తు సంస్ధలతో అయినా విచారణ చేయించాలి కదా ? అదికూడా ఎందుకు జరగలేదు ? ఎల్లోమీడియాలో వచ్చిన కథనంలో ఎక్కడా ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తున్నట్లు లేదు. టెక్నాలజీలో నిపుణుడైన ఎవరైనా సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరి ఫోన్లను అయినా ట్యాపింగ్ చేయచ్చని రాశారంతే. నిజంగానే ప్రైవేటు వ్యక్తులతో ప్రభుత్వమే ట్యాపింగ్ చేయిస్తోందనే అనుకుందాం. మరి ఆ విషయాన్ని ఎల్లోమీడియా కానీ చంద్రబాబు కానీ నిరూపించాలి కదా ? తాను రాసిన కథనం నిజమే అయితే అందుకు తగ్గ ఆధారాలతో మరుసటి రోజు ఫాలో అప్ స్టోరిగా ఎందుకు రాయలేదు ? కథనం అంతా తప్పులే అని ప్రభుత్వం లీగల్ నోటీసు ఇచ్చినపుడైనా తన దగ్గరున్న ఆధారాలతో మళ్ళీ ఫాలో అప్ కథనం రాయాలి కదా ?
ఇక్కడే చంద్రబాబు పాత్రపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎల్లోబ్యాచ్ మధ్య ఉన్న పర్ఫెక్ట్ అండర్ స్టాండింగ్ అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఆరోపణలు చేయగానే ఎల్లోమీడియా ప్రాధాన్యతిస్తుంది. లేకపోతే ఎల్లోమీడియాలో కథనాలు, వార్తలు రాగానే దాన్ని చంద్రబాబు పట్టుకుని నానా యాగీ చేస్తాడు. ఇదంతా గడచిన ఏడాదిగా జరుగుతున్నతంతే అన్న విషయం జనాలకు బాగానే అర్ధమైపోయింది. బహుశా ఇపుడు కూడా ఫోన్ ట్యాపింగ్ వార్తను చంద్రబాబే ఎల్లోమీడియాతో రాయించాడా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. లేకపోతే కథనం అచ్చేసిన ఆంధ్రజ్యోతే క్లారిటితో రాయనపుడు చంద్రబాబు మాత్రం ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందని ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయటమే విచిత్రంగా ఉంది.
చంద్రబాబు ఫిర్యాదే విచిత్రమంటే టిడిపి నేతలతో పాటు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ లాంటి వాళ్ళు కూడా ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ఎవ్వరు కూడా ట్యాపింగ్ జరిగింది అని చెప్పటానికి ఆధారాలను చూపకుండానే ఆరోపణలు చేసేస్తున్నారు. ఫోన్లు ట్యాంపిగ్ జరిగిందని ఇంతవరకు ఏ న్యాయమూర్తి కూడా బహిరంగంగా అంగీకరించలేదు. అయినా అందరూ కలిసి ప్రభుత్వంపై బండలేసేస్తున్నారు. వీళ్ళే ఇలాగుంటే ఓ న్యాయవాది హైకోర్టులో ఏకంగా కేసే వేసేయటం ఆశ్చర్యంగా ఉంది. లాయర్ కేసు వేయటం, హైకోర్టు పిటీషన్ను అడ్మిట్ చేసుకోవటం అన్నీ అయిపోయాయి. ఒకవైపు ప్రభుత్వం ట్యాపింగ్ అంతా భూటకమంటోంది. ప్రతిపక్షాలు మాత్రం ట్యాపింగ్ జరుగుతోందనే అంటున్నాయి. మరి తాజా వివాదం చివరకు ఏ మలుపు తీసుకుంటుందో చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి