చినబాబు నారా లోకేష్ కు ఆవేశం వచ్చేసింది. హత్యకేసులో అరెస్టయి జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పరామర్శించిన తర్వాత నారా లోకేష్ మాట్లాడుతూ 40 మంది వైసిపి ఎంఎల్ఏలు జైలు కెళ్ళటం ఖాయమంటూ వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది. పేదలకు ఇళ్ళ స్ధలాల సేకరణలో జరిగిన అవినీతిలో అధికార పార్టీ ఎంఎల్ఏలు జైలుకెళతారట. ఎలాగయ్యా అంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావటం ఖాయమని లోకేష్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. తాము అధికారంలోకి రాగానే వైసిపి ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తారట. దాంతో ఇళ్ళ స్ధలాల సేకరణలో జరిగిన భారీ అవినీతి కారణంగా 40 మందిని జైలుకు పంపుతామని చెప్పటమే విచిత్రంగా ఉంది.
వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై టిడిపి అధికారంలోకి వస్తే విచారణ జరిపిస్తామని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఒకవైపేమో తమ హయాంలో జరిగిన వ్యవహారాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరిపేందుకు లేదంటే టిడిపి నేతలు కోర్టులో కేసు వేశారు. మరి ఇదే నిజమైతే వైసిపిలో జరిగిన వ్యవహారాలపై టిడిపి ప్రభుత్వం కూడా విచారణ జరిపేందుకు లేదు కదా. టిడిపి హయాంలో అవినీతి, అక్రమాలు జరిగాయని, అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం సిట్ ఏర్పాటు ద్వారా విచారణ చేయిస్తోంది.
అయితే తమ ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలపై ఎటువంటి విచారణ జరిగేందుకు లేదంటూ టిడిపి నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్య కోర్టులో కేసు వేశారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. మరి వైసిపి ప్రభుత్వం జరిపిస్తున్న విచారణను కోర్టు ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న టిడిపి తాము అధికారంలోకి వస్తే వైసిపి ప్రభుత్వంపై ఎలా విచారణ చేయిస్తుందో లోకేష్ వివరణ ఇస్తే బాగుంటుంది. అంటే తాము చేసిన అవినీతికి ఒక న్యాయం, వైసిపి ప్రభుత్వంలో జరిగిన అవినీతికి మరో న్యాయం అమల్లావలని చినబాబు కోరుకుంటున్నాడా ?
ఇక్కడ విచిత్రమేమిటంటే కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసి ప్రభాకర్ రెడ్డి మీద పెట్టినవి దొంగ కేసులే అని లోకేష్ తీర్పు చెప్పేశాడు. పై ముగ్గురి మీద కోర్టుల్లో కేసులు విచారణలో ఉండగానే లోకేష్ ఏ విధంగా దొంగకేసులని తేల్చేశాడు. తాము తప్పు చేసినట్లు జేసి ప్రభాకర్ రెడ్డే అంగీకరించినట్లు ఆమధ్య వార్తలు వచ్చాయి. ఇక కార్మికశాఖలో ఇఎస్ఐ ఆసుపత్రుల నిర్వహణ వ్యవహారాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఏసిబి తేల్చిన తర్వాత అచ్చెన్న అరెస్టయ్యాడు. ఎందుకంటే అవినీతి జరిగినపుడు మంత్రిగా ఉన్నది అచ్చెన్నే కాబట్టి. అరెస్టయిన ముగ్గురు తప్పులు చేశారా లేదా అన్న విషయాన్ని కోర్టులు తేలుస్తాయి. వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ దొంగ కేసులే అని చెప్పటంలో లోకేష్ కు తొందరెందుకు ?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి