పంచాయితి ఎన్నికల నోటిఫికేషన్ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల నిర్వహణకన్నా ప్రజారోగ్యమే మిన్నంటు కోర్టు స్పష్టంగా తేల్చేసింది. ప్రభుత్వం వద్దంటున్నా వినకుండా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒంటెత్తు పోకడతో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో ప్రభుత్వం కేసు వేసింది. ఆ కేసును విచారించిన హైకోర్టు నోటిఫికేషన్ను కొట్టేసింది. తర్వాత డివిజన్ బెంచ్ కి వెళితే కేసును 18వ తేదీన విచారిస్తానని చెప్పింది. అత్యవసరంగా విచారించాలని నిమ్మగడ్డ కోరితే అవసరం లేదు పొమ్మన్నది. సరే ఇదంతా అందరికీ తెలిసిందే. మరిపుడు నిమ్మగడ్డ ఏమి చేయబోతున్నారు ?  డివిజన్ బెంచిముందు అప్పీలులో మాత్రం ఏమవుతుంది ? ఏ కోర్టు కూడా ప్రజారోగ్యం కన్నా ఎన్నికలే ముఖ్యమని చెప్పదు. పైగా 16వ తేదీ నుండి వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైపోతోంది.





ఒకసారి వ్యాక్సినేషన్ మొదలైపోయిన తర్వాత కార్యక్రమాన్నుండి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల నిర్వహణకు మళ్ళించమని ఏ కోర్టు కూడా చెప్పదు. పైగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే వచ్చే నష్టం కూడా ఏమీలేదు. ఎన్నికలు నిర్వహించకపోయినా పంచాయితీ రాజ్ నిధులను ఆపేది లేదని ఇఫ్పటికే కేంద్రప్రభుత్వం చెప్పేసింది కాబట్టి నిధులు కూడా ల్యాప్స్ అయిపోతాయనే బాధలేదు. కాబట్టి నిధుల విషయంలో నిమ్మగడ్డ చేస్తున్న వాదనలోని డొల్లతనం బయటపడిపోతోంది. కేసు తీసుకెళ్ళి అర్జంటుగా విచారణ చేయాలన్న నిమ్మగడ్డ లాయర్ అభ్యర్ధనను కోర్టు పక్కన పెట్టేసిందంటేనే అర్ధమైపోతోంది డివిజిన్ బెంచ్ మూడ్. కాబట్టి సింగిల్ బెంచ్ తీర్పుకు భిన్నంగా డివిజన్ బెంచ్ తీర్పిస్తుందని అనుకునేందుకు లేదు. మరి డివిజన్ బెంచ్ కూడా నిమ్మగడ్డ కోరికను మన్నించకపోతే అప్పుడు ఏమి చేస్తారు ? హైకోర్టులోనే ఫుల్ బెంచ్ కు వెళతారా ? లేకపోతే సుప్రింకోర్టులో కేసు వేస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది.  





ఒకవేళ కేసు సుప్రింకోర్టు దాకా వెళితే ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలూ కోర్టుమెట్లెక్కుతాయి. ఇలా ఒక్కో ఉద్యోగసంఘం కోర్టులో కేసులు వేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీఎన్జీవో సంఘం, పంచాయితీ రాజ్ శాఖ ఉద్యోగుల సంఘం, ఉపాధ్యాయ సంఘం, రెవిన్యు ఉద్యోగ సంఘం ఇలా చాలా సంఘాలు రెడీగా ఉన్నాయి కోర్టులో కేసులు వేయటానికి. కోర్టులో కేసులు, తీర్పులు, మళ్ళీ అప్పుళ్ళు అన్నీ పూర్తయ్యేటప్పటికి పుణ్యకాలం గడచిపోయి చివరకు నిమ్మగడ్డ పదవీ విరమణ కూడా చేసేస్తారు. ఎందుకంటే ప్రభుత్వ సహకారం లేకుండా ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ ఒక్కఅడుగు కూడా ముందుకేయలేరన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: