
నల్గొండ జిల్లాలోని నాగార్జుసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేస్తున్న బీజేపీ పరిస్ధితి మరీ అన్యాయంగా తయారైందట. నామినేషన్ తేదీ చివరివరకు బీజేపీ తన అభ్యర్ధిని ప్రకటించలేదు. చివరినిముషంలో నివేదితారెడ్డే అభ్యర్ధిగా ప్రకటించింది. అయితే ఏమయ్యిందో ఏమో మళ్ళీ రవికుమారే తమ అభ్యర్ధి అంటు బీఫారం కూడా ఇచ్చేసింది. మరి అప్పటికే నామినేషన్ వేసి ప్రచారం కూడా చేసేసుకుంటున్న నివేదితారెడ్డి పరిస్దేంటి ? అనేది ఇపుడు సస్పెన్సుగా మారింది. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే రవికుమార్ నాయక్ నామినేషన్ వేసిన వెంటనే టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేసుకున్న కడారి అంజయ్యయాదవ్ వెంటనే టీఆర్ఎస్ లో చేరిపోయారు.
ఈ రెండు ఇష్యూస్ ఇపుడు బీజేపీని అయోమయంలో పడేసింది. ఎందుకంటే నివేదితారెడ్డి పోయిన ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. అయినా నియోజకవర్గాన్ని, పార్టీనే అంటిపెట్టుకున్నారు. అలాంటిది ఇపుడు ఇంకెవరికో టికెట్ ఇస్తే ఎలాగంటూ మండిపోతున్నారు రెడ్డిగారు. నియోజకవర్గంలో బీసీలు, (యాదవులు) ఎస్టీల జనాభా దాదాపు సమంగా ఉంది. అలాగే రెడ్లు కూడా బాగానే ఉన్నారు. అయితే మొదటినుండి రెడ్లదే ఆధిపత్యం. అభ్యర్ధి ప్రకటన విషయంలో బీజేపీ,టీఆర్ఎస్ చివరినిముషం వరకు దాగుడు మూతలడాయి. రెండుపార్టీలు కూడా తమపార్టీ అభ్యర్ధి ఎవరనే విషయాన్ని రహస్యంగానే ఉంచాయి. అయితే నామినేషన్ తేదీ వచ్చేసింది కాబట్టి లేటుచేస్తే కష్టమని టీఆర్ఎస్ దివంగత ఎంఎల్ఏ నోముల నర్సింహయ్య యాదవ్ కొడుకు నోముల భగత్ నే రంగంలోకి దింపింది.
అంటే టీఆర్ఎస్ అభ్యర్ధి యాదవ్ సామాజికవర్గానికి చెందిన నేత. అలాగే కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డి. బీజేపీ అభ్యర్ధి రవికుమార్ నాయక్. ముగ్గురు మూడు సామాజికవర్గాలకు చెందిన వాళ్ళు. నిజానికి టీఆర్ఎస్ లో చేరిన అంజయ్యయాదవ్ బీజేపీలోనే ఉండుంటే కమలంపార్టీకి బాగా ఉపయోగంగా ఉండేది. ఈయనకు టికెట్ హామీ ఇచ్చే ఏడాది క్రితం టీడీపీలో నుండి బీజేపీలోకి చేర్చుకున్నారు అగ్రనేతలు. అలాంటిది చివరి నిముషంలో చెయ్యివటంతో ఒళ్ళుమండిపోయి టీఆర్ఎస్ లో చేరారు. అలాగే నివేదిత కూడా పోటీలోనే ఉంది. దాంతో తాను ప్రత్యర్ధులతో పోరాడాలా ? లేకపోతే సొంతపార్టీ నేతల పోటీనే తట్టుకోవాలా ? అర్ధంకాక రవికుమార్ నాయక్ లో టెన్షన్ పెరిగిపోతోంది. చివరికి ఏమవుతుందన్నది ఆసక్తిగా మారింది.