అదేంటి.. చంద్రబాబు ఏంటి.. తెలుగు దేశంపై పగబట్టడం ఏంటి.. అనుకుంటున్నారా.. నిజమే..ఇది చదవడానికి విడ్డూరంగానే ఉంటుంది. కానీ కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే.. కొన్ని కొన్ని లాజిక్కులు, పాయింట్ల వారీగా ఆలోచిస్తే అవును కదా.. అనిపిస్తుంది. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే.. ఏ ప్రాంతీయ పార్టీ నేత అయినా తన పార్టీని మరింత విస్తరించాలనుకుంటారు. బహుశా చంద్రబాబు కూడా మొదట్లో అదే అనుకున్నారు కావచ్చు. అందుకే ఆయన తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు హోదాలో కొనసాగుతున్నారు.

కానీ.. ఇప్పుడు జాతీయ హోదా సంగతి పక్కకుపెడితే.. ఉన్న ఏపీలోనే పరిస్థితి గందరగోళంగా ఉంది. పక్కన ఉన్న తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. తప్పు తప్పు.. ఆ పరిస్థితి వచ్చింది అనడం కంటే.. ఆ పరిస్థితి తెచ్చుకున్నారు అనడం కరెక్టేమో.. ఎందుకంటే.. తన రెండు కళ్ల సిద్ధాంతం తన పార్టీని తెలంగాణలో ఇబ్బందుల్లో పడేస్తుందని ఆయనకూ తెలుసు. కానీ.. చంద్రబాబుకు ఏపీయే ప్రధమ ప్రాధాన్యం అయ్యింది. అలాగని తెలంగాణలో పార్టీని జగన్‌లా ఎత్తేయలేరు.. ఎత్తేయలేదు కూడా.

పోనీ.. ఉన్న పార్టీనైనా కాస్త జాగ్రత్త చేసుకున్నారా అంటే అదీ లేదు. 2014, 2018 ఎన్నికల్లో జనం కాస్తో కూస్తో ఆ పార్టీకి ఓట్లేసినా.. ఆ తరవాత ఎందుకు ఓట్లు వేశాంరాబాబూ అనుకునేలా చేశారు. రేవంత్ రెడ్డి వంటి నాయకులు స్వయంగా చంద్రబాబుకు చెప్పే పార్టీ మారారు. ఉన్నవారినీ కాపాడు కోలేకపోయారు. చంద్రబాబు నుంచి కనీస మద్దతు కొరవడడంతో తెలంగాణలో తెలుగు దేశం పూర్తిగా కనుమరుగు కాబోతోంది. తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ ఆ పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు.

అంతకుముందు.. కొందరు తనకు అత్యంత సన్నిహితులుగా పేరున్న సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి వారిని కూడా బీజేపీలోకి పంపించారు. ఇలా సొంత వారిని పొరుగు పార్టీల్లోకి పంపిస్తూ చంద్రబాబు సొంత పార్టీనే దెబ్బ తీసుకుంటున్నారా అన్న అనుమానం కలుగక మానదు. అందుకే కాస్త అతిశయోక్తిగా ఉన్నా.. కొంపదీసి.. తెలుగు దేశంపై చంద్రబాబు పగబట్టారా..? అని జనం అనుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: