దాదాపు 27 ఏళ్ల నుంచి అటు శ్రీలంకపై వన్డే ఫార్మాట్లో పూర్తిస్థాయి ఆదిపత్యం చెలయిస్తూ వస్తుంది టీమిండియా. ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు అని చెప్పాలి. అలాంటిది రోహిత్ శర్మ సారధ్యంలో ఇటీవల వన్డే సిరీస్ లో ఓడిపోయింది భారత జట్టు. అది కూడా ఆఖరి మ్యాచ్లో 110 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలు కావడం భారత అభిమానులను మరింత నిరాశకు గురిచేసింది. ఇక ఈ ఓటమిని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు టీమిండియా ఫ్యాన్స్. అయితే భారత ఆటగాళ్లు అనవసర ప్రయోగాలు చేయడం ఇక గెలుపు పై దృష్టి పెట్టకుండా రిలాక్స్ అవడం కారణంగానే ఇలాంటి ఓటమి తప్పలేదు అంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి.
ఇక ఇలాంటి విమర్శలు గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. తాము రిలాక్స్ అయ్యాము అంటూ వస్తున్న కామెంట్స్ పై స్పందిస్తూ.. ఇది ఒక పెద్ద జోక్. భారత్ కు ఆడుతున్నప్పుడు రిలాక్స్ అనేది ఎప్పుడు ఉండదు అంటూ స్పష్టం చేశాడు. అయితే ఈ వన్డే సిరీస్ లో మెరుగైన ప్రదర్శన చేయలేదని అంగీకరించిన రోహిత్ శర్మ.. ఈ ఓటమితో ప్రపంచం ఏం అంతం కాదని అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఈ ఓటమిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ చెబుతూనే.. ఈ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. టి20 ప్రపంచకప్ విజయంతో తాము రిలాక్స్ అయ్యాము అన్న వాదనలు కరెక్ట్ కాదని.. ఇది పెద్ద జోక్ అంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు.