తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025 ఫైనల్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు తమ చిరకాల కలను నెరవేర్చుకుంది. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ మొదటిసారిగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన RCB... ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో మారు మోగుతోంది. RCB అభిమానులకు ఇది కేవలం విజయం కాదు, ఒక భావోద్వేగ ప్రయాణానికి ముగింపు. ఒక కలకు ప్రతిఫలం.

నిజానికి RCB పాత జట్టును చూస్తే అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, క్రిస్ గేల్, AB డివిలియర్స్, షేన్ వాట్సన్ వంటి లెజెండరీ ఆటగాళ్లు ఉన్నా కూడా జట్టు ఎప్పుడూ టైటిల్ గెలుచుకోలేకపోయింది. విజయానికి అవసరమైన కర్మ, కృషి ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం దరిచేరలేదు. కానీ 2025లో పరిస్థితి పూర్తిగా మారింది. ఈసారి కూడా జట్టులో విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా వంటి సీనియర్లు ఉన్నా.. ప్రధాన విజయాన్ని తెచ్చింది మాత్రం యంగ్ స్టర్స్. కొత్త ఆటగాళ్ల ఆటతీరు, ధైర్యం, ఒత్తిడిలో కనబరిచిన సత్తా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కెప్టెన్ రజిత్ పటిదార్ నాయకత్వంలో జట్టు తన అసలైన శక్తిని బయటపెట్టింది.

ఫైనల్ మ్యాచ్‌లోనూ రజిత్ పటిదార్ చక్కటి ఆటతీరు, బౌలర్లను సమర్థవంతంగా వినియోగించిన తీరు, నిర్ణయాలలో ధైర్యం చూపిస్తూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. దీనివల్ల అభిమానుల హృదయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇప్పుడు అభిమానులు అతన్ని కేవలం కెప్టెన్‌గా కాకుండా, ఫ్యాన్స్ గాడ్ గా చూస్తున్నారు. ఇతర సీనియర్లకు మించిన హైప్ ఇప్పుడు రజిత్ పటిదార్‌కు దక్కుతోంది. కోహ్లీ కల నెరవేరింది... కానీ, అందులో పటిదార్ నాయకత్వం వల్లే విజయాన్ని చేరడం అతన్ని అభిమానులకు మరింత దగ్గర చేసింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో #CaptainPatidar, #RCBChampion ట్రెండింగ్‌లో ఉండటం ఇందుకు నిదర్శనం.

ఈ విజయంతో RCB మాత్రమే కాదు, వారి కోట్లాది మంది అభిమానుల కల కూడా నెరవేరింది. ఇది కేవలం ట్రోఫీ గెలుపు కాదు, ఒక భావోద్వేగ విజయం. లెజెండ్స్ చేతిలో సాధించలేని విజయాన్ని యంగ్ స్టర్స్ చేతిలో సాధించగలిగారు. ఇది RCB చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: