
పీర్జాదిగూడలోని క్యూ న్యూస్ కార్యాలయంలో సీసీఎస్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. దీంతో కార్యాలయం బయట భారీగా పోలీసులను మొహరించారు. లోపలికి ఎవరినీ అనుమతించలేదు. ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సైబర్ క్రైమ్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేశారు. విచారణ పేరుతో పోలీసులు ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన కోర్టును ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులిచ్చిన నోటీస్‌ను రద్దు చేయాలని కోరారు. మల్లన్నకు చెందిన యూట్యూబ్ ఛానల్‌లో సోదాలు పూర్తయిన అనంతరం హార్డ్ డిస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీపడిన తీన్మార్ మల్లన్న ద్వితీయస్థానంలో నిలిచారు. తరుచుగా తెలంగాణ ప్రభుత్వంపై, అధికార పార్టీపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.