ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌న్సూరాబాద్ లో మంగ‌ళ‌వారం రాత్రి ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌న్సూరాబాద్- స‌హారాస్టేట్ రోడ్డు వ‌ద్ద స‌ద‌మ్ అనే వ్య‌క్తి గ‌త మూడు సంవ‌త్స‌రాల కాలం నుంచి న్యూఫ్యాష‌న్  పేరుతో ప‌రుపుల దుకాణం ఏర్పాటు చేశాడు. ఇక్క‌డ కొత్త ప‌రుపుల‌ను తయారు చేయ‌డం, పాత ప‌రుపుల‌ను రిపేయిర్ చేయ‌డం వంటి ప‌నులు చేస్తుంటారు.

మంగ‌ళ‌వారం రాత్రి స‌మ‌యంలో షాపులో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా ఒక్క‌సారిగా మంట‌లు ఎగిసిప‌డ్డాయి. దీంతో దుకాణంలో ప‌ని చేస్తున్న సిబ్బంది అప్ర‌మ‌త్తం అయి వెంట‌నే ఫైర్ అధికారుల‌కు స‌మాచారం అందించారు. హుటాహుటిన ఫైర్ అధికారులు రెండు ఫైర్ ఇంజ‌న్ల‌తో మంట‌లను అదుపులోకి తీసుకొచ్చారు. స‌మీపంలో ఉన్న షాపులకు మంట‌లు అంటుకోకుండా ఫైర్ సిబ్బంది జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఎల్బీన‌గ‌ర్ ఇన్‌స్పెక్ట‌ర్ అశోక్‌రెడ్డి కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేదు. కానీ ల‌క్ష‌ల మేర ఆస్తి న‌ష్టం జ‌రిగినట్టు నిర్వాహ‌కుడు స‌ద‌మ్ పేర్కొన్నాడు. తాము క‌ష్ట‌ప‌డి త‌యారు చేసే బెడ్లు ఒక్క‌సారిగా మంట‌ల్లో క‌లిసి పోయాయ‌ని బాధితుడు, బాధితుని భార్య బోరున విల‌పిస్తున్నారు. ల‌క్ష‌ల మేర ఆస్తి న‌ష్టం జ‌రిగింద‌ని బాధ‌ప‌డుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: