సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తే ఏం వస్తుంది. మహా అయితే నెలకు రూ.లక్ష జీతం వస్తుంది. కానీ రోజంతా కష్టపడాలి. ప్ర‌తి రోజూ తొమ్మిది గంట‌ల‌పాటు ఆఫీస్ లో పని చేయాలి. వారానికి రెండు రోజులు సెలవు లు ఉన్నా ఆ సెలవులు కాస్తా విశ్రాంతి తీసుకోడానికి గడిచిపోతాయి. మళ్లీ సోమవారం వచ్చిందంటే ఆఫీస్ కు పరిగెత్తాల్సిందే. ఇక అప్పుడప్పుడు టూర్లు సినిమాలు షికార్లు ఉన్నా మళ్లీ ఆఫీస్ కి వెళ్లాలని టెన్షన్ మాత్రం ఉంటూనే ఉంటుంది. ఇక వచ్చే సంపాదన కూడా సిటీ లైఫ్ లో ఖర్చు అయిపోతుంది. అందుకే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉద్యోగం విడిచిపెట్టాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నట్టుగానే ఉద్యోగానికి గుడ్ బై చెప్పాడు. అంతేకాకుండా జీవితంలో ఫుల్ గా సంపాదించాలని అనుకున్నాడు. అయితే  సంపాదించేది ఏదో నీతిగా నిజాయితీగా కాకుండా దొంగ దారిలో వెళ్లాలి అనుకున్నాడు. 

దానికోసం జనాలను సులభంగా మాయచేసి కోట్లు సంపాదించే దారిని వెతుక్కున్నాడు. మనదేశంలో లాజిక్కుల కంటే మ్యూజిక్ ల‌నే ఎక్కువ నమ్ముతారు అని జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ను ఫాలో అయ్యాడు. ఏకంగా బాబాగా అవతారం ఎత్తాడు. లక్షల్లో డబ్బు... కోట్లల్లో ఆస్తులు సంపాదించాడు. రోగాలు నయం చేస్తానని చెప్పి భక్తుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు. చివరికి ఓ మహిళ ఫిర్యాదుతో బండారం బయటపడింది. ఇంతకీ ఎవరా బాబా... బండారం ఎలా బయటపడింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.. నల్గొండ జిల్లాకు చెందిన విశ్వ చైత‌న్య అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేసి పీఏ పల్లి మండలం రామాపురం లో పది ఎకరాల స్థలంలో ఆశ్రమం నిర్మించుకున్నాడు. ఈ ఆశ్ర‌మంలో గత కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 

అంతేకాకుండా హోమాల పేరుతో మోసాలు జరుగుతున్నట్టు ప్రచారం కూడా ఉంది. న్యాయం చేస్తానని చెప్పి భక్తుల నుండి లక్షల్లో వసూలు చేసి విశ్వ చైతన్య జ‌నాల‌ను బురిడీ కొట్టించాడు. యూట్యూబ్ ఛానల్ వేదికగా ప్ర‌జ‌ల‌కు ఆక‌ర్షిస్తూ మోసాల‌కు పాల్పడుతున్నాడు. అయితే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంతా బయట పడింది. దాంతో పోలీసులు ఈ సాఫ్ట్ వేర్ బాబాను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టేశారు. ఇక పట్టుబడ్డ నగదు, కోట్ల విలువ చేసే భూముల పత్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాబపై విచారణ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: