దాదాపు రెండు నెలల క్రితం అదృశ్యమైన చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్ పూ విషయంలో చైనా తొలిసారి స్పందించింది. ఆయన్ను పదవి నుంచి తొలగించినట్లు ఇటీవల అధికారిక మీడియా వెల్లడించింది. అయితే చైనా రక్షణ మంత్రి అదృశ్యమైన విషయాన్ని చైనా మొదట నుంచి చెప్పలేదు. ఆ వార్తను తొలిసారిగి బహిరంగ పరిచింది జపాన్ లోని అమెరికా రాయబారి కావడం విశేషం.


దేశంలోని అగ్రశ్రేణి చట్ట సభ అయిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీలోని సభ్యులు కూడా రక్షణ మంత్రిని తొలగించినట్లు ఓటేశారు. ఉద్వాసనకు కారణాలు ఏంటనేది వెల్లడించలేదు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పారిశ్రామిక వేత్తల నుంచి మంత్రుల వరకు అకస్మాత్తుగా అదృశ్యమవుతున్నారు. ఈ ఏడాది మేలో అప్పటి విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ ఇలానే అదృశ్యమయ్యారు. తర్వాత  కొన్ని రోజులకు ఆయన్ను తప్పించి ఆ బాధ్యతలు గతంలో నిర్వహించిన వాంగ్ యూకి అప్పజెప్పారు.  ఆకస్మికంగా ఆయన్ను భర్తీ చేసిన తర్వాత కొద్ది నెలల్లోనే చైనాలో జరిగిన రెండో అతి పెద్ద మార్పు ఇది.


చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ ఫూ చివరిసారిగా ఆగస్టు 29న బీజింగ్ లో జరిగిన చైనా-ఆఫ్రికా శాంతి భద్రతా ఫొరంలో ప్రసంగించినప్పుడు బహిరంగంగా కనిపించారు. అలాగే వాల్ స్ర్టీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. రక్షణ మంత్రి షాంగ్ ఫూ అదృశ్యం కావడానికి వారం ముందు అధికారులు ఆయన్ను విచారణకు తీసుకు వెళ్లారు. అవినీతి కేసులో ఆయనపై విచారణ కొనసాగుతుంది.


చైనా సైన్య ఆయుధ సరఫరా విభాగానికి నాయకత్వం వహించిన షాంగ్ ఫూ ఇటీవలే పదోన్నతి పొంది చైనా రక్షణ మంత్రిగా పనిచేశారు. దీనికి ముందు ఆయన ఐదేళ్ల పాటు ఆయుధాల సేకరణకు బాధ్యత వహించారు. జిన్ పింగ్ నాయకత్వాన్ని ప్రశ్నించినందుకే ఇలా జరిగింది అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: