జనసేన పార్టీ స్థాపించి నేటికి ఆరు సంవత్సరాలు అవుతోంది. కానీ ఇప్పటికీ ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి జనసేనకు, ఆ పార్టీ అధినేత పవన్ కు ఉన్నట్టుగా ఇప్పటికీ కనిపించడం లేదు. ఒక బలమైన, సమర్ధుడైన నాయకుడు గా తనను తాను తీర్చిదిద్దుకోవడంలో పవన్ విఫలమవుతూనే వస్తున్నారు. కనీసం సొంత పార్టీ నాయకులకు కూడా ఆయన భరోసా కల్పించలేకపోతున్నారు. అసలు పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అన్న మాట పక్కన పెడితే ఎంతకాలం రాజకీయాల్లో ఉండగలుగుతుంది అనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పటికీ జనసేన పార్టీకి ఒక విధానం లేదు. ఏ విషయంలోనూ సరైన నిర్ణయం తీసుకోవడంలో పవన్ ఇంకా గందరగోళం కనిపిస్తున్నారు.


 జనసేన పార్టీని స్థాపించి నేటికి ఆరు సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని చూసినా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉండటంతో సాదాసీదాగానే ఆవిర్భావ వేడుకలను నిర్వహించాల్సి వచ్చింది. రాజమండ్రిలో జనసేన వేడుకలను నిర్వహించేందుకు ఈ రోజు ఉదయం పవన్ మధురపూడి చేరుకుని రాజమహేంద్రవరం వెళ్లారు. అక్కడ పార్టీ నాయకులతో సమావేశం ఆరేళ్లలో పార్టీ సాధించిన ప్రగతి పై సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే ధవలేశ్వరం వద్ద ఈ కార్యక్రమం లో భాగంగా గోదావరి హారతి ఇచ్చి రచ్చబండ నిర్వహించారు.ఈ సందర్భంగా పిల్లలతో నది పరిరక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 


ఇంత వరకు బాగానే ఉన్నా, అసలు జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని వైసీపీపై  దండ యాత్రగా మలుచుకోవాలని ముందుగా జనసేన భావించింది. అయితే ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటంతో 144 సెక్షన్ అమలులో ఉంది. దీనితో బహిరంగ సభను వాయిదా వేసుకుంది.ఇక జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు విషయానికి వస్తే 2014 లో తెలుగుదేశం బీజేపీ కూటమి తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ రెండు పార్టీలకు మద్దతుగా పవన్ రాష్ట్రమంతా పర్యటించారు. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చేలా తన వంతు కృషి చేశారు. 2014  - 19 మధ్య రాజకీయాలు మారిపోయాయి. 


లుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీ తో కలిసి ఎన్నికల బరిలోకి దిగారు.. కనీసం 40 50 సీట్లు వస్తాయని భావించినా కేవలం ఒకే ఒక్క సీటుకు జనసేన పరిమితం అయిపోయింది. అంతే కాకుండా స్వయంగా పార్టీ అధ్యక్షుడు పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఎదురుగాలే వీచింది. ప్రస్తుతం పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్తున్నారు. కానీ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే ఇప్పటి వరకు పవన్ ప్రతి విషయంలోనూ తప్పటడుగు వేస్తూనే ఉన్నారు. అసలు పార్టీ పెట్టిన మొదట్లో తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రశ్నించడానికి వచ్చాను అంటూ చెప్పిన పవన్ ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలి పోయాడు. 


అంతేకాదు ఏ నిర్ణయంలోనూ సరైన క్లారిటీ లేకపోవడం, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లోనే పవన్ రాజకీయాలు చేస్తున్నట్లుగా జనసేన పార్టీలోనూ,జనాల్లోనూ బలమైన ముద్ర వేయించుకుంది. దీని కారణంగానే జనసేన పార్టీలో చేరికలు లేకపోగా, పార్టీ నాయకులే ఇతర పార్టీల్లోకి వలస వెళ్ళే విధంగా ఆ పార్టీలో పరిస్థితులు మారాయి. జనసేన పార్టీ లో మొత్తం పవన్ ఒక్కరే వ్యవహారాలు చేస్తున్నారు. మరో నేత ఎవరు హైలెట్ రావడం లేదు. నాదెండ్ల మనోహర్ పవన్ స్టైల్ లో వ్యవహారాలు చేస్తున్నా, ఆయన ఇతర నాయకులను చిన్నచూపు చూడడం, పెద్దగా ఎవర్ని దగ్గరికి రానివ్వకపోవడం వంటి పరిణామాలతో నాదెండ్ల వ్యవహారం ఆ పార్టీలో నాయకులకు నచ్చడం లేదు.


ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బిజెపి కూటమి తో కలిసి బరిలోకి దిగుతున్నా, చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు పలుకుతోంది. దీంతో మొదటి నుంచి పవన్  తెలుగుదేశం మాన్సిషి అనే మాట నిజం అవుతోంది. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన విధివిధానాలు కూడా ఆ పార్టీలో పెద్దగా కనిపించకపోవడంతో పెద్దగా జనసేన ను ఎవరూ పట్టించుకోవడంలేదు. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో పాటు సినిమాల మీద కూడా దృష్టి పెట్టడం తో జనసేన రాజకీయ భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ బలపడుతుందనే ఆశలు కూడా ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో కనిపించడం లేదు. ఏదో ఒక పార్టీకి మద్దతుగా నిలిచేందుకు జనసేన పార్టీ ఆవిర్భవించింది అన్నట్టుగా ప్రస్తుతం జనసేన పార్టీ పరిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: