
‘కాపు రిజర్వేషన్లకు మీరెలాగూ వ్యతిరేకమే ...కనీసం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లయినా అమలు చేయండి’ ఇది తాజాగా తిరుపతిలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాన్ చేసిన డిమాండ్. తిరుపతిలో రెండు రోజుల రాజకీయ వ్యవహారా కమిటి సమావేశాల తర్వాత పవన్ కల్యాణ్ చేసిన డిమాండ్ చాలా డ్యామేజింగా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ అమలు చేయటానికి ఎలాగూ మీకు ఇష్టంలేదు కనీసం కేంద్రం ప్రకటించిన 10 రిజర్వేషన్లయినా అమలు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. తాజా డిమాండ్ చూసిన తర్వాత అసలు ఏ విషయంలో అయినా పవన్ కు సరైన పరిజ్ఞానముందా అనే అనుమానం రాకమానదు. రిజర్వేషన్ల వ్యవహారం పూర్తిగా కేంద్రప్రభుత్వం పరిధిలోనిదే అన్న కనీసం జ్ఞానం కూడా పవన్ కు ఉన్నట్లు లేదు.
రిజర్వేషన్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా కేంద్రం మాత్రమే చేయగలదు. రిజర్వేషన్ల అమలులో ఏదైనా సమస్యలు తలెత్తితే కోర్టులో జోక్యం చేసుకుని పరిష్కరిస్తాయి. కాపులకు రిజర్వేషన్ అన్నది జగన్ పరిధిలోని అంశం కాదన్న విషయం కూడా పవన్ కు తెలీదా ? 2014 ఎన్నికల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని హామీఇచ్చిన చంద్రబాబునాయుడు ఎందుకు ఫెయిలయ్యారో పవన్ కు తెలీకుండానే ఉంటుందా ? మొన్నటి ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉండగా జగన్ను కొందరు కాపులను బీసీల్లో కలపాలని డిమాండ్ చేశారు. దానికి జవాబుగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వటానికి తాను వ్యతిరేకం కాకపోయినా అది తన పరిధిలో లేని అంశమని స్పష్టంగా ప్రకటించారు. తన పరిధిలో లేని అంశంపై తాను హామీ ఇచ్చి చంద్రబాబు లాగ మోసం చేయలేనని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయమని అడగటంలో తప్పులేదు. ఎందుకంటే 10 రిజర్వేషన్ అమలు చేస్తున్నది కేంద్రమే. తాను నిర్ణయం తీసుకుని అమలు చేసే బాధ్యత రాష్ట్రాలకు వదిలిపెట్టేసింది కేంద్రం. 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణా సీఎం కేసీయార్ కూడా ఇపుడే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న పవన్ డిమాండ్ లో అర్ధముంది. అంతేకానీ కాపులకు రిజర్వేషన్లు అమలు చేయటానికి జగన్ వ్యతిరేకమని చెప్పటమే తీవ్ర అభ్యంతరకరం. కాబట్టి ఏదైనా విషయంపై మాట్లాడేముందు దానిపై కాస్త కసరత్తు చేసి మాట్లాడితే అందరు హర్షిస్తారని పవన్ తెలుసుకోవాలి.