అవును చదవటానికి విచిత్రంగానే ఉన్నా జరిగినది చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బుధవారం పార్లమెంటులో ఏపికి ప్రత్యేకహోదా విషయంలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వకూడదని నరేంద్రమోడి గట్టిగానే డిసైడ్ అయ్యారు. ఆ విషయం అప్పుడప్పుడు అనేక వేదికల్లో కేంద్రప్రభుత్వం చెప్పింది. అయితే పార్లమెంటులో ఇపుడు జరిగిన రచ్చ గతంలో ఎప్పుడు జరగలేదు. పైగా వైసీపీ, టీడీపీలు ఇద్దరు కూడా కూడబలుకున్నట్లుగా కేంద్రప్రభుత్వంపై దాడి చేసినట్లుగా ఉంది వ్యవహారం. లోక్ సభ+రాజ్యసభలో రెండుపార్టీల ఎంపిలు కలిసి వరసబెట్టి కేంద్రాన్ని వాయించేశారు. పదే పదే ప్రత్యేకహోదా విషయాన్ని ఇవ్వాల్సిందేనంటూ ఒత్తిడిపెట్టారు. దాంతో ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం కూడా అంతేగట్టిగా సమాధానమిచ్చింది.




నిజానికి రెండుపార్టీల ఎంపిలు వ్యూహాత్మకంగానే ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించినట్లు అనుమానంగా ఉంది. విషయం ఏమిటంటే సరిగ్గా తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలకు ముందు పార్లమెంటులో ప్రత్యేకహోదా ఇచ్చేది లేదన్న కేంద్రం ప్రకటన కచ్చితంగా బీజేపీని ఇబ్బంది పెట్టేదే అనటంలో సందేహంలేదు. హోదా అనేది రాష్ట్రప్రజల్లో ఓ సెంటిమెంటుగా బలపడిపోయింది. ఇలాంటి సున్నితమైన అంశంలో కేంద్రాన్ని బలవంతంగా అదీ కచ్చితంగా ఏపి ప్రయోజనాల విషయంలో కమిట్ చేయించేందుకే రెండుపార్టీలు ప్రయత్నించాయా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మన ఎంపిలు అనుకున్నట్లే కేంద్రం కూడా కమిట్ అయిపోయింది.




ప్రత్యేకహోదా విషయంపై వైసీపీ+టీడీపీ ఎంపిలడిగిన ప్రశ్నలు, కేంద్రం చెప్పిన సమాధానం, ఎంపిలు చేసిన రచ్చంతా మీడియాలో బాగా హైలైట్ అయ్యింది. దాంతో రెండుపార్టీలకు వచ్చే అదనపు ఉపయోగం ఏమీ లేకపోయినా బీజేపీకి మాత్రం తీరని నష్టం తప్పదనే ప్రచారం పెరిగిపోయింది. ఎన్నికలకు ముందు ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం చెప్పిన తర్వాత తిరుపతి ఉపఎన్నికలో బీజేపీకి ఎందుకు ఓటేయాలనే వాదన మొదలైంది. ఇపుడిదే వాదన సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అసలే బీజేపీ పరిస్ధితి అంతంతమాత్రం. కనీసం డిపాజిట్ కూడా వస్తుందో లేదో డౌటే. ఇలాంటి పరిస్ధితుల్లో ఏపి ప్రయోజనాలను దెబ్బకొట్టడంతో ఉపఎన్నికల్లో బీజేపీని కనీసం గట్టిగాప్రచారం కూడా చేసుకునే అవకాశం లేకుండా కేంద్రమే చేసేసింది. మొత్తానికి బీజేపీని ఇరుకునపెట్టేందుకు వైసీపీ, టీడీపీ ఎంపిలు మంచి గేమ్ ప్లే చేసినట్లుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: