దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. మౌనంగా భరిస్తున్న ప్రజలు, ఎన్నికల్లో ఎన్డీఏకి చుక్కలు చూపించడం ఖాయం అని అనుకుంటున్నారంతా. వచ్చే ఏడాది జరగబోతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పెరుగుతున్న పెట్రోల్ రేట్లు కీలకంగా మారతాయని ఓ అంచనా. అంతే కాదు, కరోనా కష్టకాలంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, వ్యాక్సినేషన్ ఆలస్యం కావడం, ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు ఇబ్బంది పడటం.. ఇవన్నీ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. కానీ అక్కడుంది మోదీ. ఆయన్ను అంత తక్కువ అంచనా వేయలేం. సరిగ్గా ఎన్నికలనాటికి ఏదో ఒక జిమ్మిక్కు చేసి ఒడ్డునపడగల సత్తా ఆయనతోపాటు, ఆయన టీమ్ కి కూడా ఉంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నా.. యూపీలో ఈసారి కూడా అధికారం బీజేపీదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు.

పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. అయితే ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో కనిపించలేదు ఆ సమయానికి సర్జికల్ స్ట్రైక్స్, ఇతర దేశాలతో యుద్ధ వాతావరణమే హైలెట్ అయింది. భారత్ ని రక్షించడానికి ఏకైక ప్రత్యామ్నాయం ఎన్డీఏ అనే ప్రచారం జరిగింది. దీంతో మరోసారి బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది. అప్పటికంటే ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నా యూపీలో గట్టెక్కడం మోదీ టీమ్ కి సాధ్యమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇటీవల 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తిగా అనుకూల ఫలితాలు రాలేదు. సరిగ్గా ఆ ఎన్నికల ప్రచార సంరంభం మొదలైన సమయంలో.. అంతర్జాతీయ కుట్ర అనే మాటను మోదీ వాడారు. భారత్ పై అంతర్జాతీయ కుట్ర జరుగుతోందనే అనుమానాలున్నాయని సెలవిచ్చారు. సరిహద్దుల్లో మెల్లగా అలజడి మొదలవుతోంది. చైనా యుద్ధవిమానాలు మాక్ డ్రిల్ చేపట్టాయని, సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొందనే సంకేతాలిచ్చారు. ఇక కరోనా విషయంలో కూడా చైనాని నిందించడం మొదలైంది. సరిహద్దుల విషయాలు యూపీ ఎన్నికలను ప్రభావితం చేస్తాయా లేదా అనే విషయాలను పక్కనపెడితే.. బీజేపీ మాత్రం ఆ దిశగా ప్రచారం చేసుకుంటుందనుకోవడంలో అనుమానం లేదు. అదే సమయంలో సోషల్ మీడియాను కంట్రోల్ చేయడంపై కూడా బీజేపీ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టంది. వాట్సప్ కి తాఖీదులు, ఫేస్ బుక్ కి ఆజ్ఞలు ఇవన్నీ అందులో భాగమే. ఇలాంటి ప్రయత్నాలు బీజేపీని ఒడ్డునపడేస్తాయో లేదో తెలియదు కానీ.. ఇలాంటి ప్రణాళికలు రచించడంలో మోదీ-అమిత్ షా ద్వయం మాత్రం ముందంజలో ఉంటుంది. 2019 లోక్ సభ ఎన్నికల ఫార్ములా 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: