రాజ‌కీయాల్లో చిత్రాలు ఉండొచ్చు. ఇది స‌హ‌జంగా జ‌రిగేదే.. ! అయితే.. చిత్రాలే రాజ‌కీయాలు అయితే. ఇప్పుడు ఏపీలో జ‌రుగుతోంది ఇదే!  ఇక్క‌డ జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా.. భీమ్లానాయ‌క్ చుట్టూ.. రాజ‌కీయం సాగుతోంది. దీనిని ఎన్ని కోణాల‌లో రాజ‌కీయం చేయొచ్చే అన్నీ చేస్తున్నార‌నేది ప‌వ‌న్ అభిమానుల ఆవేద‌న‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపింద‌ని.. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింద‌ని కొంద‌రు గగ్గోలు పెట్టారు. రాజకీయ కార‌ణాలతోనే ప‌వ‌న్‌ను అణిచేస్తున్నార‌ని అన్నారు. అయితే.. వాస్త‌వానికి నిజంగానే టికెట్ ధ‌ర‌ల‌ను పెంచ‌క‌పోతే.. ప‌వ‌న్‌కు వ‌చ్చిన న‌ష్టం ఏంటో వీరు చెప్ప‌లేదు.

ప‌వ‌న్ తీసుకునే రెమ్మున‌రేష‌న్ ఆయ‌న తీసేసుకున్నాడు. సో.. ఏపీలో ధ‌ర‌లు త‌గ్గినా.. పెరిగినా ఆయ‌న‌పై ప‌డే ప్ర‌భావం లేదు. ఇక‌, ఐదో ఆట‌ను నిషేధించార‌ని చెప్పారు. ఇది కూడా ఆయ‌న‌కు పెద్ద‌గా న‌ష్టం చూకూర్చే విష‌యం కాదు. అభిమానులుగా ఉన్న‌వారు.. నాలుగు ఆట‌లు వేసినా.. ఎగ‌బ‌డి చూస్తున్నారు. ఐదు ఆటలు ఉన్నా .. ఇదే ప‌రిస్థితి. దీంతో ఈ విమ‌ర్శ‌లు గాలికి పోయాయ‌ని చ‌ర్చ కు వ‌చ్చింది. దీంతో ఇప్పుడు మ‌రో ప్ర‌ధాన, అంత్యంత కీల‌క‌మైన విమ‌ర్శ‌ను తెర‌మీదికి తెచ్చారు.

అది కూడా ఒక సామాజిక వ‌ర్గానికి ముడి పెట్టేసి మాట్లాడారు. ఆ కులాన్ని తొక్కేయాల‌ని జ‌గ‌న్ కంక‌ణం క‌ట్టుకున్నాడు కాబ‌ట్టి ఇలా చేస్తున్నార‌ని అన్నారు. అదేంటంటే.. ప‌వ‌న్ కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కాబ‌ట్టి.. కాపుల‌ను ఎద‌గ‌నీయ‌కుండా చూడాల‌నే ల‌క్ష్యంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం పాల‌న చేస్తోంది కాబ‌ట్టి.. ఇలా చేస్తున్నార‌ని.. టీడీపీకి చెందిన ఒక కీల‌క ఎమ్మెల్యే (ఈయ‌న కాపు కాదు) వ్యాఖ్యానించారు.

పోనీ.. ఇదే నిజం అనుకున్నా.. పుష్ప సినిమా.. హీరో.. కూడా కాపు కులస్తుడే. ప‌వ‌న్‌కు బంధువే క‌దా.. మ‌రి ఆ సినిమాను తొక్కేయ‌లేదు. అలాకాదు.. అస‌లు కాపుల‌పైనే జ‌గ‌న్ క‌క్ష ఉంద‌ని అనుకుంటే.. ముగ్గురు కాపు  నేత‌ల‌కు  మంత్రి ప‌ద‌వులు ఎందుకు ఇచ్చారో.. అర్ధం కాదు. ఇలా ఎలా చూసుకున్నా.. ఇప్పుడు కాపుల‌తో భీమ్లా నాయ‌క్ సినిమాకు ముడిప‌ట్టి చేసిన విమ‌ర్శ ఎక్క‌డా పొస‌గ‌డం లేదు. ఒక్క రాజ‌కీయం త‌ప్ప‌. అందుకే.. మ‌రీ ఇది చిత్రం బ్రో అంటున్నారు నెటిజ‌న్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: