
ఇటీవలి కాలంలో దేశంలో రోజురోజుకూ పరిణతి, పరిపక్వత సాధిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై కొందరు ప్రపంచ లేదా పాశ్చాత్య మేధావులు కొందరు అభాండాలు వేస్తూ, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పైన చెప్పిన వైట్ హౌస్ అధికారి–జాన్ కర్బీ భారత ప్రజాస్వామ్యం నాణ్యతపై వెలిబుచ్చిన అభిప్రాయానికి విలువ వచ్చింది.
అయితే అసలు జాన్ కర్బీ ఈ మాటలు ఎందుకు అన్నారంటే.. ఇండియాలో ప్రజాస్వామ్యం ఆరోగ్యంపై అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఏమాత్రమైనా పట్టించుకుంటోందా? అని ఓ మీడియా ప్రతినిధి ఆయన్ను ప్రశ్నించారు. దీనిపై అమెరికా ఉన్నతాధికారి జాన్ కర్బీ నిక్కచ్చిగా సమాధానమిచ్చారు. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి.. 21వ శతాబ్దం ఆరంభం నుంచి మన ఇండియాలో ఆర్థికాభివృద్ధి శరవేగంతో సాగుతోంది.
ఒక్క ఆర్థికరంగంలోనే కాదు.. అన్ని రంగాల్లో భారతదేశం పురోగమిస్తోంది. వివిధ పారిశ్రామిక, ధనిక దేశాల్లో భారతీయులు విశేష ప్రగతి సాధిస్తున్న విషయం కూడా అందరూ అంగీకరిస్తున్నారు. కానీ.. భారత్ కొత్త ప్రపంచ ఆర్థికశక్తిగా అవతరించడం కొందరికి గిట్టడం లేదు. ఇండియాలో ప్రజాస్వామ్యం ‘ఆరోగ్యం’ లేదా నాణ్యతపై అప్పుడప్పుడూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే.. 1950 జనవరిలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి పార్లమెంటుకు 17 సార్లు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇండియాలో అధికారం ఎన్నికల ద్వారానే వివిధ పార్టీల మధ్య బదిలీ అవుతోంది. అదే గొప్ప విషయం.