
అయితే తెలంగాణలో కాంగ్రెస్ మార్కు రాజకీయం మళ్లీ మొదలైంది. ఎన్నికల ఫలితాల వెంటనే జరగాల్సిన సీఎం ఎంపిక వాయిదా పడింది. సీఎం గా ఎవర్ని ఎంపిక చేయాలి అనే పంచాయితీ అంత ఈజీగా తేలేలా లేదు. సీఎల్పీ నేత కోసం సోమవారం హైదరాబాద్ లో జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. గచ్చిబౌలిలోని ఓ హోటల్ లో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం రాకపోవడంతో నిర్ణయాన్ని అధిష్ఠానానికి వదిలేశారు.
దీంతో సాయంత్రం వరకు ప్రకటన వస్తుంది. రాత్రి 7.30 తర్వాత సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి…రేవంత్ రెడ్డి సీఎం అని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. సీన్ కట్ చేస్తే ఏఐసీసీ ముఖ్య పరిశీలకుడిగా వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దిల్లీకి వెళ్లడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
సీఎం పదవిపై రేసులో ఉన్న నాయకులెవరూ కూడా పట్టు వీడకపోవడంతో సీఎం ఎంపికపై కాస్త ఉత్కంఠ రేగింది. దీంతో రేసులో ఉన్న వారందరి పేర్లు తీసుకొని ఏఐసీసీ త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. ఆ తర్వాత చివరకు చర్చల తర్వాత రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో సస్పెన్స్ తొలగిపోయింది. ఈ వ్యవహారం ఇంకా నానితే కాంగ్రెస్‌కు చెడ్డపేరు వచ్చి ఉండేది.