ఏపీలో పరిస్థితి చూస్తుంటే ఈ సారి హోరాహోరీ పోరు తప్పేలా లేదు. పోలింగ్ టైం కూడా దగ్గర పడుతుంది. పట్టుమని వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు అధికారమే లక్ష్యంగా మ్యానిఫెస్టోలు విడుదల చేశాయి. జగన్ తాను చేయగలిగింది ఇదే అంటూ పాత పథకాలకు కొంత నగదు అదనం చేసి ప్రకటించారు.


చంద్రబాబు చూస్తే ఆకాశమే హద్దు అన్నట్లుగా అన్ని వర్గాలకు హామీలను ఇబ్బడి ముబ్బడిగా ప్రకటించేశారు. దీంతో ఎవరు గెలుస్తారు అంటే మళ్లీ సస్పెన్స్ గానే మారింది. ఎందుకంటే ఇద్దరి మ్యానిఫెస్టోల్లో అభివృద్ధి కన్నా కూడా సంక్షేమమే ఎక్కువగా కనిపిస్తోంది. దీనితోనే ఓట్ల పంట పండిచుకోవాలని ఆశ ఆరాటం రెండూ ఉన్నాయి. ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు.. అభివృద్ధి వంటి అంశాలను పట్టించుకోవడం లేదు. ఎవరు అయితే సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తారో వారి వైపే ఉంటాం అని చెబుతున్నారు.


ఇదిలా ఉండగా.. ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ప్రభుత్వం నడపాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే వీరి ఇచ్చిన హామీలకు రాష్ట్ర ఖజానా సరిపోయేలా లేదు. ఇక ఈ విషయంలో చంద్రబాబు కంటే జగన్ కాస్తా బెటర్ గా కనిపిస్తున్నారు. ఎందుకంటే గతంలో అమలు చేసిన పథకాలే కాబట్టి పెద్దగా రిస్క్ ఉండదు.


కానీ చంద్రబాబు అలా కాదు. రూ.4వేల పింఛన్ అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచే.. 66లక్షల మందికి ఇవ్వాలి. ఇక వాలంటీర్లు రూ.10 వేల చొప్పున 2.50లక్షల మందికి ఇవ్వాలి. తల్లికి వందనం పేరిట అందరికీ, ఉచిత బస్సు ప్రయాణం, ఇంటికి మూడు సిలిండర్లు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. మొత్తం మీద చూస్తే రూ.లక్షల కోట్ల వ్యవహారంలా మారుతుంది. ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే చంద్రబాబు కూటమిలో ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి నిధులు రాకుండా జగన్ ని అష్టదిగ్బందనం చేస్తే .. ఆయన కూడా ప్రభుత్వాన్ని నడపడంలో ఎదురీదాల్సి వస్తోంది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో గెలిచిన విజేతకు రాష్ట్రాన్ని నడపడం అంత సులభం కాదని అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: