కొన్నాళ్ల కిందటి వరకు వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వర్సెస్ బొలిశెట్టి మధ్య తీవ్ర వివాదం రాజుకుంది. ఒకరిపై ఒకరు దూషణలు కూడా చేసుకున్నారు. సవాళ్లు విసురుకున్నారు. దీంతో కొన్నాళ్లు ఈ నియోజకవర్గం వార్తల్లోకి ఎక్కింది. అయితే.. తాజాగా బొలిశెట్టి సొంత కూటమి పార్టీ అయిన.. టీడీపీ, బీజేపీపైనే నిప్పులు చెరిగారు. దీంతో అసలు కూటమిలో సఖ్యతపై ముఖ్యంగా గూడెం నియోజకవర్గంలో నాయకుల తీరుపై చర్చ తెరమీదికి వచ్చింది. తనను చంపేసి.. లేదా తాను చచ్చిపోతే.. వచ్చే ఉప ఎన్నికల కోసం.. తమ కూటమి నాయకులే ఎదురు చూస్తున్నారని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదేసమయంలో నియోజకవర్గంలో తాను ఎవరి సొమ్మునూ దోచుకోవడం లేదన్నారు. జనసేన అధినేత, తమ నాయకుడు పవన్ కల్యాణ్ టికెట్ ఇస్తే.. తాడేపల్లిగూడెం ప్రజలు ఓటేస్తే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని బొలిశెట్టి చెప్పారు. ఇదేసమయంలో మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. `ఎవరి దయ దక్షిణ్యాల వలన నేను గెలవలేదు` అనేశారు. అంతేకాదు.. గూడెం నియోజకవర్గాన్ని మరో పిఠాపురం చేసేస్తానంటున్నారని కూటమి పార్టీలపై విరుచుకుపడ్డారు. కానీ, తాను చూస్తూ ఊరుకోనని.. తానేమీ చేతికి గాజులు తొడుక్కోలేదని ఘాటుగా స్పందించారు.
ఎందుకిలా..
ఇక ఎందుకిలా గూడెం రాజకీయాలు పది మాసాల్లోనే మారిపోయాయని చూస్తే.. అంతర్గత కుమ్ములాటలుపెరిగాయన్నది స్పష్టంగా తెలుస్తోంది. టీడీపీ కన్నా బీజేపీ నాయకులు పైచేయి సాధించాలన్న ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి టీడీపీఇక్కడ నుంచి ప్రాతినిధ్యం తగ్గించేసుకుంది. మిత్రపక్షాలకు టికెట్లు కేటాయిస్తోంది. 2014లో బీజేపీకి, 2024లో జనసేనకు ఇచ్చేసిన టీడీపీ.. 2019లో మాత్రం ఈలి నానీకి టికెట్ ఇచ్చింది. కానీ, ఆయన ఓడిపోయారు. అయితే.. టీడీపీకి చెందిన ఓ నాయకుడు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. దీనికి బీజేపీ నాయకులు తోడయ్యారు. వీరంతా వైసీపీ నేత కొట్టుతో మిలాఖత్ అయ్యారన్న చర్చ ఉంది. ఇదే బొలిశెట్టి ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు