
జనసేన పార్టీకి ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. నామినేటెడ్ పదవులు పార్టీకి పెద్ద సంఖ్యలో దక్కుతున్నా, వాటిని భర్తీ చేసే స్థాయిలో సరైన నాయకులు లేరనే లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు సుమారు 30 పైగా నామినేటెడ్ పదవులు కేటాయించే అవకాశం ఉంది. కానీ, అర్హులైన వారు లేకపోవడం వల్ల ఇప్పటికే ఖాళీగా ఉన్న పదవులు టీడీపీ నేతలకు వెళ్లిపోతాయన్న భయంతో జనసేన శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
తిరుపతి, నిడదవోలు, కాకినాడ రూరల్ వంటి ప్రధాన నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులు జనసేనకు లభిస్తున్నా, వాటిని ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో అంతర్గత చర్చలు ఎక్కువయ్యాయి. స్థానికంగా కొందరు చిన్న స్థాయి నాయకులు ఉన్నా, వారిని ఆ బాధ్యతలు చేపట్టే స్థాయిలో పార్టీ విశ్వసించడం లేదు. ఈ లోటు కారణంగా టీడీపీకి చెందిన వారితో పోలిస్తే జనసేన కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీలో నాయకులు అధిక సంఖ్యలో ఉండటంతో ఎంపిక కష్టమవుతుంటే, జనసేనలో మాత్రం సరైన అభ్యర్థుల కొరత ఎదురవుతోంది.
ఈ నేపథ్యంలో జనసేనలో ఒక ప్రతిపాదన కూడా చర్చకు వచ్చింది. అదేంటంటే వైసీపీ నుంచి కొందరిని చేర్చుకుని వారికి ఈ పదవులు ఇవ్వాలా అన్నది. అయితే పార్టీ అధిష్టానం ఆ ఆలోచనను సూటిగా తిరస్కరించినట్లు సమాచారం. ముఖ్యంగా సహకార సొసైటీ చైర్మన్ పదవులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 6-10 సొసైటీలు ఉండటంతో అవి పూర్తిగా భర్తీ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాటిని నిర్వహించే సత్తా గల నాయకులు జనసేనలో లేరనే వాస్తవం బయటపడుతోంది. దీనితో ఆయా ప్రాంతాల వైసీపీ మాజీ నేతలపై జనసేన దృష్టి పడిందన్న చర్చలు వినిపిస్తున్నాయి. మరి జనసేనలో నాయకత్వ కొరత ఎప్పటకీ తీరుతుందో ? చూడాలి.