రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన, డివిజన్ల ఏర్పాటు, అలాగే కొత్త జిల్లాల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తీవ్రమైన కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి ఇక మిగిలిన సమయం చాలా తక్కువ. కేంద్ర గణాంకాల శాఖ స్పష్టంగా తెలిపిన ప్రకారం డిసెంబర్ 20వ తేదీ లోపు జిల్లాలు, మండలాలు, డివిజన్ల సరిహద్దులను ఖరారు చేయాలి. డిసెంబర్ 21 తర్వాత సరిహద్దుల్లో మార్పులు చేయడానికి అవకాశం లేకపోవడంతో, ప్రభుత్వం ముందున్న రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిందే. సమయం తక్కువగా ఉన్నా సమస్యలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన మార్కాపురం, మదనపల్లె కొత్త జిల్లాల విషయంలో అనేక అభ్యంతరాలు, మార్పుల సూచనలు వస్తుండడంతో వాటిని పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది. తాజాగా రాజంపేటను కొత్త జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ మరింత బలంగా వినిపిస్తోంది. ఈ డిమాండ్ రాజకీయపరంగా కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.


ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాలోని కీలక నియోజకవర్గమైన రాజంపేటలో టిడిపి గత ఎన్నికల్లో విజయాన్ని సాధించింది. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తే కడప జిల్లాలో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపుతూ టిడిపి పటిష్టమయ్యే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మరో వైపు శ్రీకాకుళం జిల్లాలో కొంతభాగాన్ని విడదీసి కొత్త జిల్లా ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న జిల్లాలకు పేర్ల మార్పులు చేయడం వంటి పలు విషయాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. రెండు వేల కుపైగా వచ్చిన విజ్ఞాపనలు, అభ్యర్థనలు పరిశీలించాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం ముందు పనిభారం భారీగా కనిపిస్తోంది. ఏ ప్రాంతాన్ని ఏ జిల్లాకు కలపాలి, ఏ మండలాన్ని ఎక్కడ చేర్చాలి వంటి నిర్ణయాలు ప్రాంతీయ భావోద్వేగాలను ప్రభావితం చేసే అంశాలుగా మారాయి.


ప్రస్తుతం సీఎం చంద్రబాబు అత్యంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఢిల్లీ పర్యటన ఉంటుంది. అనంతరం శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంలో జిల్లాల పునర్విభజనపై సీఎం ఎంత సమయాన్ని కేటాయిస్తారు, ఎలాంటి ప్రాధాన్యాన్ని ఇస్తారు అనేది కీలకంగా మారింది. ఈ ప్రక్రియను తొందరపడి చేస్తే వైసిపి హయాంలో వచ్చినట్లే తిరిగి తప్పిదాలు జరగొచ్చన్న అభిప్రాయం కూడా కొందరి నుంచి వ్యక్తమవుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరో 30 రోజుల వ్యవధిలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాబోయే రాజకీయ సమీకరణాలపై కూడా గణనీయ ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఈ కీలక నిర్ణయం ఎటువైపు దారితీస్తుందో అన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: