మన ఆరోగ్యానికి కాల్షియం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరంలోని దాదాపు ప్రతి భాగం సక్రమంగా పనిచేయడానికి ఇది కీలకం. ఆరోగ్యకరమైన దంతాలు, బలమైన ఎముకలు, మెరిసే జుట్టు, బలమైన కండరాలు కావాలంటే కాల్షియం తప్పనిసరిగా ఉండాలి. ప్రతి డాక్టర్ కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు – “ప్రతి ఒక్కరికి కాల్షియం చాలా అవసరం, కాల్షియం పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి” అని చెప్తూ ఉంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 14 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్నవారికి రోజుకు దాదాపు 1300 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం. అలాగే 19 నుంచి 70 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారికి రోజుకు 1000 నుంచి 1200 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం అని అనేక పరిశోధనల్లో నిర్ధారించారు. అంటే చిన్న వయసు నుంచి వృద్ధాప్యం వరకు కాల్షియం శరీరానికి అత్యవసర పోషక పదార్థం.


మనలో చాలా మంది క్యాల్షియం అనగానే మొదట గుర్తు చేసుకునేది పాలు. “పాలు తాగితేనే క్యాల్షియం లభిస్తుంది” అని భావించి, ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లలకు గ్లాసుల కొద్దీ పాలు బలవంతంగా తాగిస్తుంటారు. అయితే కొంతమందికి పాల వాసన నచ్చదు, పాలు తాగితే వాంతులు వచ్చే స్థితి వస్తుంది. అయినప్పటికీ, “కాల్షియం కోసం పాలు తప్పనిసరి” అనే కారణంతో బలవంతంగా తాగించటం జరుగుతుంది. కానీ వైద్యుల మాట ప్రకారం, పాలకంటే ఎక్కువగా కాల్షియం లభించే ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి. పాలు తాగకపోయినా ఆ పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసినంత కాల్షియం అందుతుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్  వివరాల ప్రకారం, ఒక కప్పు తక్కువ కొవ్వు ఉన్న పాలలో దాదాపు 314 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇది మన రోజువారీ అవసరమైన కాల్షియం విలువల్లో సుమారు 24% కు సమానం. అంటే పాలు ఒక మంచి మూలం కానీ, అది మాత్రమే కాదు. ఇంకా ఎన్నో ఆహార పధార్ధాలల్లో క్యాల్సియం అత్యధికంగా ఉంటుంది. అవి ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!


పెరుగు:

పాలు తాగడం ఇష్టం లేకపోయినా, పెరుగు మాత్రం చాలా మంది తింటారు. పెరుగు కూడా పాలలాగే కాల్షియం సమృద్ధిగా కలిగి ఉంటుంది. అంతేకాదు, పెరుగు తినేటప్పుడు దానిలో కొద్ది పండ్లు కలిపి తింటే రుచి కూడా పెరుగుతుంది, శరీరానికి కావలసిన పోషకాలు కూడా ఎక్కువగా లభిస్తాయి.

బాదంపప్పు:

బాదం అనగానే గుర్తుకు వచ్చేది ఆరోగ్యకరమైన కొవ్వులు. కానీ అందులో కాల్షియం కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక కప్పు బాదంలో లభించే కాల్షియం, ఒక కప్పు పాలలో లభించే కాల్షియం కంటే ఎక్కువ. బాదంలో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఏ కూడా పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల రోజూ కొద్దిపాటి బాదం తినడం వల్ల ఎముకల బలం పెరుగుతుంది.

ఆకుకూరలు:

పాలకూర, గోంగూర, మెంతికూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు కూడా సహజసిద్ధమైన కాల్షియం మూలాలు. ఇవి కేవలం కాల్షియం మాత్రమే కాకుండా  ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి. ఆకుకూరలు తరచూ తింటే ఎముకలు బలంగా మారటమే కాకుండా, శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఇతర ఆహార పదార్థాలు:

నువ్వులు : చిన్న గింజలైనా కాల్షియం లో పుష్కలంగా ఉంటాయి.

సోయాబీన్స్, టోఫు: పాలకు ప్రత్యామ్నాయంగా వీటిలోనూ మంచి స్థాయిలో కాల్షియం లభిస్తుంది.

సార్డిన్స్, సాల్మన్ చేపలు: సముద్ర చేపల్లో కూడా మంచి స్థాయిలో కాల్షియం ఉంటుంది.

క్యాల్షియం అంటే కేవలం పాలు మాత్రమే అన్న భావన తప్పు. పాలు తాగని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. పెరుగు, బాదం, ఆకుకూరలు, నువ్వులు, చేపలు వంటి అనేక ఆహార పదార్థాల్లోనూ పుష్కలంగా కాల్షియం లభిస్తుంది. కాబట్టి ఎవరైతే పాలు తాగడం ఇష్టం లేకపోతే, వారు ఈ పదార్థాలను తమ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి కావలసినంత కాల్షియం అందించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: