
# ఉప్పు ఎక్కువగా తింటే మూత్ర విసర్జనకు అనేకసార్లు వెళ్లాల్సి వస్తుంది. ఉప్పులో ఉండే సోడియంను శరీరం బయటకు పంపేందుకు నీటిని ఎక్కువగా ఉపయోగించుకుంటుంది. డయాబెటిస్ లేకుండామూత్ర విసర్జనఎక్కువగా అవుతుంటే మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారని అర్థం చేసుకోవాలి. ఆ మేరకు ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించుకుంటే ఈ సమస్య తగ్గిపోతుంది.
# మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తాం కనుక దాహం కూడా ఎక్కువవుతుంది. ఈ లక్షణం కనిపిస్తున్నా మీరు ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారని అర్థం చేసుకోవాలి.
# ఉప్పు ఎక్కువగా తీసుకునేవారి శరీరంలో వాపులు వస్తాయి. కాలి మడమ భాగం ఉబ్బుతుంది. అక్కడ వేలితో పట్టుకుంటే చర్మం లోపలికి పోతుంది. దానికి కారణం ఆ భాగంలో నీరు ఎక్కువగా చేరడమే. ఉప్పు ఎక్కువగా తినేవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. దీన్నే ఎడిమా అంటారు. ఆహారంలో ఉప్పు తగ్గిస్తే సమస్య నుంచి బయటపడవచ్చు.
# ఉప్పు బాగా తింటే నాలుకపై ఉండే రుచి కళికలు ఇతర రుచులను గుర్తించలేవు. ఫలితంగా ఏది తిన్నా సహించదు. ఉప్పు ఎక్కువగా ఉన్నవాటినే తినాలనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. దీన్నిబట్టి కూడా మీరు ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారని అర్థం చేసుకోవాలి.
# ఉప్పు ఎక్కువగా తినేవారి శరీరంలో నీరు త్వరగా ఇంకిపోతుంది. ఫలితంగా డీహైడ్రేషన్ బారిన పడి తలనొప్పి వస్తుంది. అందుకే ఆహారంలో ఉప్పు తగ్గించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ వేసవిలో శరీరం సహజంగానే డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఉప్పు అధికంగా తింటే త్వరగా డీహైడ్రేషన్ బారిన పడి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడంవల్ల అనేకరకాల అనర్థాలు కలుగుతాయి. వాటిని గుర్తించి ఎంత తక్కువగా ఉప్పు తీసుకుంటే అంత మంచిదని న్యూట్రిషన్లు చెబుతున్నారు.