ఇటీవల మరణించిన కమెడియన్ వేణుమాధవ్ గురించి సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. వందల సినిమాల్లో నటించి నవ్వించిన వేణుమాధవ్ మరణం పట్ల తెలుగు సమాజం అంతగా స్పందించలేదని కొందరు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రాంతి అనే ఓ నెటిజన్ ఆవేదన ఇది.


“ మనకు తీరిక లేదు...

మనల్ని దశాబ్దాలపాటు వినోదంలో ముంచెత్తిన

నటులు చనిపోతే ఒక నిట్టూర్పు విడిచే సమయమూ లేదు !

మనం ఎప్పుడో చెడిపోయాం..


నవ్వించేవాడు అంటే మనకు లోకువ,

ఒక అగౌరవం.. ఇంకా చెప్పాలంటే చులకన భావం

చావులో కూడా హోదా, స్థాయి వెతుక్కుని ఏడ్చే మనుషులం మనం..!


ఒక హీరోనో, కోట్లు అడ్డంగా దోచిన రాజకీయ నేతనో చనిపోతే మనకు రోజులు వారాలు హాట్ టాపిక్.. ఇళ్లల్లో, టీవీల్లో ఒకటే సోకగీతాలు.. మనల్ని ఇన్నాళ్లు కడుపుబ్బా నవ్వించిన నటులు పోతే మాత్రం ఎక్కడలేని హుందాతనం !


ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస, ఇలా చాలా మంది చనిపోయినప్పుడు గమనించింది ఒకటే చనిపోయింది కమీడియనే కదా అనే పద్దతి..

ఏముందిలే అనే ఒక చిన్న తెలికతనం !


విలక్షణమైన వారి నటనను మనం గుర్తించడంలో విఫలమయ్యామా ? కనీసం మృత్యువులోనైనా వారిని గౌరవించామా?? వేణుమాధవ్ లాంటి విలక్షణమైన హాస్య నటుడు మనకు దొరుకుతాడా అస్సలు.. మరి ఎందుకు మనం మర్చిపోయాం ఆయన్ను..

ఆరోగ్యం బాగా లేకపోతే ఏవీఎస్, ఎమ్మెస్, వేణుమాధవ్ ను సమాజంగా పరామర్శించాల్సింది పోయి.. సంవత్సరాల ముందే వారు చనిపోయారని తప్పుడు వార్తలు వేసి సంకలు గుద్దుకున్నాం.. కనీసం తప్పు తెలుసుకుని క్షమించండి అని వారి కుటుంబ సభ్యులను ఒక మాట అడగలేక పోయాం..! కమిడియన్ చావును కూడా కామెడీగా తీసుకున్న నాగరికులం మనం !

వేణుమాధవ్ ఒక డైలాగ్ చెప్పేవాడు.. టైగర్ కి టైం వస్తుంది అని.. కానీ..ఈ మనుషులకు మాత్రం మారే టైం రావాలి అని కోరుకుందాం !!

- క్రాంతి.


మరింత సమాచారం తెలుసుకోండి: