తనకు 60 ఏళ్లు వచ్చాయంటే నమ్మశక్యంగా లేదన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంట్లో, బసవతారకం ఆస్పత్రిలో బాలకృష్ణ కేక్ కట్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణకు పలువురు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. 

 

కరోనా కష్టాలు వీలైనంత తర్వాత తొలగిపోవాలని ఆకాంక్షించారు... సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. కరోనా నివారణకు అందరూ ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. తనకు అప్పుడే 60 ఏళ్లు వచ్చాయంటే నమ్మశక్యంగా లేదన్నారు. మద్రాస్‌లో పుట్టిన తాను ఆరేళ్ల వయస్సులో హైదరాబాద్‌కు వచ్చానని గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. అందరి కృషి వల్లే బసవతారకం ఆస్పత్రి నేడు ఈ స్థాయికి చేరుకుందన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా బసవతారం క్యాన్సర్‌ ఆస్పత్రిలో రోగులతో కలిసి కేకు కట్‌ చేశారు బాలకృష్ణ.

 

అంతకుముందు తన నివాసంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు బాలకృష్ణ. భార్య వసుంధర, కూతుళ్ల బ్రహ్మణి, తేజస్విని, అల్లుళ్లు లోకేష్ భరత్, వియ్యంకుడు చంద్రబాబు దంపతులు.. బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 

 

బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ఘనంగా జరిగాయి. బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా తయారు చేయించిన కేకులను కట్‌చేసి వేడుకలు జరుపుకున్నారు. 

 

60వ పుట్టిన రోజు జరుపుకుంటున్న బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖులు. ఇదే ఉత్సాహం, ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని... చిరంజీవి ఆకాంక్షించారు. మరో హీరో జూనియర్ ఎన్టీఆర్... కూడా ట్వీట్ చేశారు. తనకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో బాలయ్యేనని అన్నారు. తనలో అభిమానిని తట్టిలేపింది మీరేనంటూ ట్వీట్ చేశారు.  ఇక నటనైనా, రాజకీయమైనా చేసే ప్రతిపనిలో నూటికి నూరుపాళ్లు  నిబద్ధతతో ఉండే వక్తి బాలకృష్ణ అని కొనియాడారు చంద్రబాబు. బాలకృష్ణకు షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: