టాలీవుడ్ మళ్లీ ఆలోచనల్లో పడింది. ముందుకెళ్లాలా.. ఇంకొంత కాలం వెయిట్ చేయాలా అనే సందిగ్ధంలో ఉండిపోయింది. షూటింగ్స్ కు పర్మీషన్ వచ్చినా సెట్స్ పైకి వెళ్లేందుకు మాత్రం సాహసం చేయలేకపోతున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు చూసి షూటింగ్ షెడ్యూల్స్ అన్నిటినీ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు.


షూటింగ్స్ కి దగ్గరుండి పర్మీషన్ తీసుకొచ్చిన చిరంజీవి, ఆచార్యని మాత్రం అంత హరీబరీగా మొదలుపెట్టాలనుకోవడం లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులను చూసి, చిరుని సెట్స్ పైకి పంపించడం లేదు రామ్ చరణ్. పరిస్థితులు  అనుకూలించేవరకు షూటింగ్స్ అనే ఆలోచనని పక్కన పెట్టేయాలని దర్శకుడు కొరటాల శివకు కూడా చెప్పాడట చరణ్. ఇక ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు రామ్ చరణ్.

 

రెండేళ్లుగా సాగుతున్న ప్రేమకథను వీలైనంత త్వరగా తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు ప్రభాస్. కుదిరితే జులైలోనే షూటింగ్ కు వెళ్లాలని సెట్స్ కూడా రెడీ చేయిస్తున్నారు నిర్మాతలు. ఫారెన్ షెడ్యూల్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేసి హైదరాబాద్ లోనే షూటింగ్ చేసుకోవాలని ప్రణాళికలు రచించారు. అయితే జి.హెచ్.ఎమ్.సి పరిధిలోనే కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో షూటింగ్స్ గురించి పునరాలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. 

 

అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ రగ్గడ్ లుక్ లో నటిస్తున్న సినిమా పుష్ప. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అంచనాలు పెంచిన ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకున్నాడు బన్నీ. అందుకే కేరళ, థాయిలాండ్ షెడ్యూల్స్ ని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అడవులకు మార్చాడు. కానీ కరోనా విజృంభణ చూసి ఈ ప్లాన్ ని కూడా పోస్ట్ పోన్ చేసుకుందట పుష్ప యూనిట్. 

 


లాక్ డౌన్ సడలింపులు ఇవ్వగానే షూటింగ్స్ చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాలకు రిక్వెస్టులు పెట్టింది టాలీవుడ్. కానీ సడలింపులతో పాటే కరోనా కేసులు కూడా పెరిగిపోతున్నాయి. పైగా ఇప్పటికే షూటింగ్ లు చేసుకుంటున్న టీవీ ఇండస్ట్రీలో కరోనా కేసు నమోదయింది. దీంతో టాలీవుడ్ స్టార్స్ అంతా వెనుకడుగు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: