తమిళ నటి వీజే చిత్ర ఆత్మహత్యను మరవకముందే మరో విషాదం చోటుచేసుకుంది. డర్టీ పిక్చర్ నటి ఆర్య బెనర్జీ అనుమానాస్పద స్థితిలో మరణించింది. కోల్‌ కతాలోని ఆమె నివాసంలో చనిపోయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

డర్టీ పిక్చర్ లో నటించిన ఆర్య బెనర్జీ  అనుమానాస్పద స్థితిలో మరణించింది. సౌత్ కోల్‌ కతా, జోధ్‌ పూర్ పార్క్‌ లో ఉంటోంది ఆర్య బెనర్జీ. శుక్రవారం సాయంత్రం  పని మనిషి ఎన్నిసార్లు తలుపు కొట్టినా తెరవకపోవడం, ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూస్తే బెడ్‌ మీద ఆర్య శవమై కనిపించింది. ఆమె ముఖంపై గాయాలు, వాంతులు చేసుకున్న ఆనవాళ్లు ఉండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆర్య బెనర్జీని ఎవరైనా హత్య చేశారా? లేక ఆమె ఆత్మహత్య చేసుకుందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యాబాలన్‌ తో కలిసి డర్టీపిక్చర్ లో నటించిన ఆర్య బెనర్జీ.. అందులో షకీలా పాత్ర పోషించింది.

సితార కళాకారుడు నిఖిల్ బందోపాధ్యాయ కుమార్తె ఆర్య బెనర్జీ. డర్టీ పిక్చర్‌ తో పాటు ఎల్ఎస్‌డీ- లవ్ సెక్స్ ఔర్ ధోకీ లాంటి ఇతర సినిమాల్లో ఆమె నటించింది. ముంబైలో మోడలింగ్ కూడా చేసిందామె. ఆర్య భౌతికకాయాన్ని పోలీసులు పోస్టుమార్టమ్ కోసం పంపారు.  ఫోరెన్సిక్ బృందాలు ఆమె రూమ్ నుంచి ఆధారాలు సేకరించాయి.

వరుస మరణాలు ఈ ఏడాది సినీ ఇండస్ట్రీని కలవరపెడుతున్నాయి. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ సూసైడ్, ఆ తర్వాత కరోనాతో పలువురు సినీ నటుల మరణాలు, ఇక ఇటీవలే తమిళ నటి వీజే చిత్ర ఆత్మహత్య.. ఇలా వరుస ఘటనలు తీవ్ర విషాదంలో ముంచెత్తుతున్నాయి. మొత్తానికి బాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ఆ చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: