మెగాస్టార్ చిరంజీవి అంటే నటనకు మారుపేరు. ఆ మధ్య రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఆ తర్వాత ఒక్కో సినిమా చేసుకుంటూ వస్తున్నారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి' వంటి రెండు భారీ చిత్రాలను తన అభిమానులకు కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం మెగా మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్నారు. అందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. దేవాదాయ భూముల స్కామ్ నేపథ్యంతో ఆచార్య సినిమా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆచార్య సినిమాలో హీరోయిన్ గా కాజల్ చేస్తోంది. రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ‘ఆచార్య' షూటింగ్ జరుగుతోన్న సమయంలో సమయంలో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మెగాస్టార్ చిరంజీవి వివరించారు. ఇందులో మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘లూసీఫర్' రీమేక్ ఒకటి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

‘లూసీఫర్' తెలుగు రీమేక్‌ను ప్రభాస్‌తో ‘సాహో' తీసిన సుజిత్ తెరకెక్కిస్తాడని చిరంజీవి గతంలోనే తెలిపాడు. అయితే స్క్రిప్టు వర్కౌట్ సరిగా కాకపోవడంతో ఆ డైరెక్టర్ ను పక్కన పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజాను దర్శకుడిగా ఎంపిక చేశాడు. ‘హనుమాన్ జంక్షన్' తర్వాత మరోసారి అతడు తెలుగులో సినిమాకు సిగ్నల్ ఇవ్వడం విశేషం. ‘లూసీఫర్' రీమేక్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయి. నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఇది పూర్తయింది. ఈ సినిమా విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.  ‘లూసీఫర్' రీమేక్ షూటింగ్ కొద్ది రోజుల్లో ప్రారంభం అవుతుంది అనగా దర్శకుడు మోహన్ రాజాను తప్పించాలని మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించుకున్నట్లు ఓ ఫిలిం నగర్ కోడైకూస్తోంది. సంతృప్తి పరిచేలా స్క్రిప్టును మార్పులు చేయకపోవడం వల్లే ఆయన ఇలా డిసైడ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. మరో డైరెక్టర్‌ను కూడా ఎంపిక చేయడానికి చిరంజీవి సన్నాహాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే ఈ సినిమా కోసం ఏకంగా ముగ్గురు స్టార్ డైరెక్టర్లు పని చేసినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: