గతంలో సినిమాలు ఎలా ఉండేవి అంటే ఏదైనా ఒక సామాజిక అంశాన్ని తీసుకుని దాని చుట్టూ ఒక హృద్యమైన కథను జోడించి ప్రజలకు తెలియచెప్పేవారు. ఆనాటి సినిమాలలో సామజిక విలువలను స్పృశించే విధంగా కథలు ఉండేవి. క్రమక్రమంగా సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వ్యాపారంలా మారిపోయింది. ఫుల్ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడం అలవాటు చేసుకున్నారు. దానితో ఇప్పటి సినిమాలలో సమాజానికి ఉపయోగపడే అంశాలు అంతగా ఉండడం లేదనే చెప్పాలి. ఇప్పుడు సినిమాలలో ఆరు పాటలు నాలుగు ఫైట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఎన్నో మంచి కథలు మనిషి విలువను, మనిషి జీవితాన్ని చెప్పేలా తెరకెక్కాయి. 1987 లో వచ్చిన స్వయంకృషి సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. మెగాస్టార్ కు జోడిగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించింది.
ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక శ్రామికుడిని తలెత్తుకుని తిరిగేలా చేసిందని చెప్పవచ్చు. ఇందులో చిరంజీవి ఒక చెప్పులు కుట్టే వ్యక్తిగా నటించిన తీరు అమోఘం మరియు అద్భుతం. తన పాత్రలో బాగా ఒదిగిపోయాడు. ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఒక సామాన్యమైన చదువు కూడా రాని వ్యక్తి స్వయం కృషిని నమ్ముకుని ఏ విధంగా జీవితంలో సక్సెస్ అయ్యాడు అని చాలా అద్భుతంగా తెలియచేశారు ఈ చిత్ర దర్శకుడు కె విశ్వనాధ్. విశ్వనాధ్ సినిమాలలో మానవీయత, బంధాలు మరియు సమాజానికి ఉపయోగపడే అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ లో చిరంజీవి నటన ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పించింది. స్వయంకృషిలో మ్యూజిక్ కి కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో నేపధ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. సందర్భానుసారంగా వచ్చే పాటలు ప్రేక్షకుడిని మైమరిచేలా చేశాయి. ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతం సమకూర్చగా, తమ గానంతో ఎస్ పి బాలసుబ్రమణ్యం, జానకి మరియు శైలజ లు పాటలకు ప్రాణం పోశారు.
ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ ప్రజల గొంతుల్లో నానుతూ ఉంటాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వాటిలో పారా హుషార్ పారా హుషార్..., చిన్ని చిన్ని కోరికలడగా .., సిగ్గూ పూబంతి పాటలు ఈ సినిమాను మరింత స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమాలో స్వయం కృషి ఉంటే ఒక మనిషి దేన్నైనా సాధించగలడు అని దర్శకుడు కళ్ళకు కట్టేలా చూపించాడు. అంతే కాకుండా మనుషుల మధ్య బంధాలను అందరికీ అర్ధమయ్యేలా చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా ఎంతలా సక్సెస్ అయిందంటే, "ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ఏలూరులో ఫుట్ పాత్ మీద చెప్పులు కొట్టుకునే ఒక వ్యక్తి స్వయం కృషి సినిమా పోస్టర్ ను వెనుక పెట్టుకున్నాడు. ఇలా సమాజంలో మార్పు తెచ్చేలా సినిమాలు తీయాలి. ఇది అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు ఉత్తమ నటన విభాగంలో చిరంజీవికి నంది అవార్డు రావడం విశేషం. ఇప్పటికి ఈ సినిమా వచ్చి 34 సంవత్సరాలయినా దీని గురించి ఎవ్వరో ఒకరు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అంతలా ప్రజలకు ఇది కనెక్ట్ అయింది. అప్పటి దాకా వచ్చిన సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన స్వయం కృషి ప్రజల గుండెల్లో సుస్థిరమయిన స్థానాన్ని సంపాదించుకుంది.
.jpg)

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి