టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో ఇటీవల ఒక పెద్దాయన చెప్పిన మాట సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఓ సినిమా ఫ్లాప్ అయితే నష్టపోయేది నిర్మాత, టికెట్ కొనే ప్రేక్షకుడు మాత్రమే. నిజంగా ఆ మాటలో నిజం ఉంది. సినిమా ఆడకపోతే నిర్మాత పెట్టుబడి కోల్పోతాడు, ప్రేక్షకుడు తన జేబుకు చిల్లు ప‌డుతోంది. మిగిలిన వారిలో హీరోలు, హీరోయిన్‌లు, టెక్నీషియన్లు, కార్మికులు అందరికీ పారితోషికం వస్తుంది. వీళ్ల‌కు సినిమా హిట్‌.. ప్లాపుతో సంబంధం లేదు... వీళ్ల‌కు రావాల్సిన రెమ్యున‌రేష‌న్ వ‌చ్చేస్తోంది.


ప్రస్తుతం నిర్మాతల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. థియేటర్లలో ప్రేక్షకుల రాక తగ్గిపోయింది. మంచి సినిమా వచ్చినా హాళ్లు నిండడం లేదు. ఓటీటీ , శాటిలైట్ హక్కుల మార్కెట్ కూడా గణనీయంగా పడిపోయింది. ఇలా ఇరువైపు లా ఆదాయ మార్గాలు తగ్గిన వేళ, సినీ కార్మికుల సమ్మె మరొక గుదిబండగా మారింది. చిన్న, పెద్ద సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్‌లు కలిపి దాదాపు వంద ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఇది సాధారణ నిర్మాతకు తట్టుకోలేని దెబ్బగా మారింది.


వేతనాలు పెంచడం సబబేనా? కాదా? అనే అంశంపై వర్గాల మధ్య పెద్ద డిబేట్ నడుస్తూనే ఉంది. కానీ దీని వెన‌క మ‌రో స‌మ‌స్య కూడా ఉంది. యూనియన్ల పేరిట దోపిడి కొన‌సాగుతోంది. ఇటీవ‌ల చిన్న‌ నిర్మాతలు ఒక ప్రెస్ మీట్ పెట్టి తమ ఆవేదనను బహిర్గతం చేశారు. ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు బడ్జెట్ ప్లాన్ చేస్తే, షూటింగ్ మధ్యలో యూనియన్ జోక్యం వల్ల ఖర్చులు పెరిగి, చివరకు ప్రాజెక్ట్ బ‌డ్జెట్  పెరిగిపోయి నిర్మాత‌ల‌కు ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌క భారీ న‌ష్టం వ‌స్తోంద‌ని వాపోతున్నారు. దీంతో కొత్త నిర్మాతలు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టే సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. ఏదేమైనా ఇప్ప‌టికే ఉన్న క‌ష్టాల‌కు తోడు యూనియ‌ర్ల స‌మ్మెతో ఇప్పుడు ఇండ‌స్ట్రీ మ‌రో సంక్షోభంలో చిక్కుకున్న‌ట్టు అవుతోంద‌న్న ఆందోళ‌న స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: