దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఎప్పుడూ చేసే ప్రతి పనిలో కొత్తదనం, వైవిధ్యం ఉంటుంది. జ‌క్క‌న్న‌ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా దాని ప్రమోషన్, ప్రెజెంటేషన్, మార్కెటింగ్ అన్నీ ఎవ్వ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండా ఉంటాయి. ఇప్పుడు అదే క్రియేటివిటీని ఆయన తన సూపర్ హిట్ ఫ్రాంచైజ్‌ “బాహుబలి” రీ రిలీజ్‌లో చూపించబోతున్నారు. బాహుబలి 1, బాహుబలి 2 రెండు భాగాలను కలిపి “బాహుబలి ఎపిక్‌” పేరుతో ఈ నెల 31న దేశవ్యాప్తంగా గ్రాండ్ రీ రిలీజ్‌ ప్లాన్ చేశారు. ఈ రీ రిలీజ్ సాధారణంగా చేసే పాత సినిమాల రీ రిలీజ్‌లా కాదు. రాజమౌళి దానిని ఒక కొత్త సినిమా రిలీజ్‌లా ట్రీట్‌ చేస్తున్నారు. ఆయన స్వయంగా ఈ ప్రాజెక్ట్‌కి ఎడిటింగ్‌, టెక్నికల్ రీఫ్రెష్‌ వర్క్‌లు పర్యవేక్షించారు.


ముఖ్యంగా, “బాహుబలి 1” మరియు “బాహుబలి 2”లో లేని కొన్ని సీన్స్‌, అనుబంధ సీక్వెన్స్‌లు ఈ ఎపిక్‌ వెర్షన్‌లో కొత్తగా చేర్చినట్లు సమాచారం. ఈ కొత్త సన్నివేశాలు ప్రభాస్ అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నింపుతున్నాయి.
అదే సమయంలో, ఈ రీ రిలీజ్ కోసం భారీ ప్రమోషన్ ప్లాన్ కూడా సిద్ధమవుతోంది. కొత్త సినిమాల మాదిరిగానే ప్రీ రిలీజ్ ఈవెంట్‌, టీజర్లు, ట్రైలర్‌ కట్‌, సోషల్ మీడియా క్యాంపెయిన్లు అన్నీ జరుగనున్నాయి. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో బిజీగా ఉన్నా కూడా, “బాహుబలి ఎపిక్‌” ప్రమోషన్‌ను స్వయంగా మానిటర్‌ చేస్తున్నట్లు సమాచారం. ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ హాజరవుతారని, అక్కడే “బాహుబలి 3”కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.


లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం రాజమౌళి “కట్టప్ప” పాత్ర ఆధారంగా కొత్త కథను సెట్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ స్పిన్‌ఆఫ్‌ తరహా కాన్సెప్ట్‌పై ఇప్పటికే ప్రీ - ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. అందువల్ల “బాహుబలి ఎపిక్‌” కేవలం రీ రిలీజ్ మాత్రమే కాకుండా, ఫ్యూచ‌ర్ ఫ్రాంచైజ్ సినిమాల‌కు ఓ దిక్సూచిలా ఉండొచ్చు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, “బాహుబలి ఎపిక్‌” రీ రిలీజ్‌లలో ఇప్పటి వరకు ఎవరూ సాధించని వసూళ్లు అందుకునే అవకాశం ఉంది. పైగా, ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఇది రీ రిలీజ్‌ల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఫ‌స్ట్ సినిమాగా నిల‌వ‌నుంది. ఈ ప్రయోగం విజయం సాధిస్తే, భవిష్యత్తులో “పుష్ప ఎపిక్‌”, “కేజీఎఫ్ ఎపిక్‌”, “కాంతార ఎపిక్‌” వంటి రెండు భాగాల సినిమాలు కూడా ఇలాగే రీ రిలీజ్ అయ్యే ట్రెండ్‌ మొదలయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: