తెలుగు ఇండస్ట్రీలో అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ చిత్రం ఈ నెల 9 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్,సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఇప్పటి వరకు సినీ తారలపై ఎలాంటి బయోపిక్ చిత్రాలు రాలేదు. మొదటి సారిగా నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ రాబోతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి.
ఈ క్రమంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇటీవల మూవీ మేకింగ్ వీడియో విడుదల చేసిన టీం తాజాగా ఎల్వీ ప్రసాద్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ గెటప్‌కి సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఇందులో నాని వాయిస్ ఓవర్ చెబుతూ అవసరాల లుక్ రివీల్ చేశాడు. ఒకప్పుడు నటుడిగా, దర్శకుడిగా ఎన్నో అద్భుతాలు సృష్టించి...మహానటులు ఎన్టీఆర్, మహానటి సావిత్రిని వెండి తెరకు పరిచయం చేసిన మహాదర్శకలు ఎల్ వి ప్రసాద్ చలన చిత్రచరిత్ర పుటల్లో నిలిచిపోయారు. అంత గొప్ప దర్శకుడి పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటిస్తున్నారు.
మహానటి చిత్రంలో సావిత్రి పాత్రని కీర్తి సురేష్ పోషించగా, జర్నలిస్ట్ మధుర వాణి పాత్రలో సమంత కనిపించనున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, షాలిని పాండే, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకుడు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించగా, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మిక్కీ జే మేయర్ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. పీరియాడిక్ బయోపిక్ గా రూపొందిన మహానటి చిత్రంలో సావిత్రి సినీ, వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాలను చూపించనున్నారు.